బీఎడ్ అభ్యర్థులు…SGTకి అర్హులే

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (Bed) అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రాథమిక స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు టీచింగ్ చేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులకు కూడా బీఎడ్‌ అభ్యర్థులకు అర్హత కల్పించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(NCTE) కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా టెట్‌ నిబంధనలను ఇటీవలే సవరించింది. బీఎడ్‌ అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలంటే ప్రైమరీ స్కూల్‌ టీచర్‌గా ఎంపికైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలన్న షరతు విధించింది. దీంతో 2011లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET)ను అమల్లోకి తెచ్చినప్పుడు విధించిన నిబంధన కారణంగా ప్రైమరీ స్కూళ్లలోని టీచర్‌ పోస్టులకు దూరమైన బీఎడ్‌ అభ్యర్థులు ఇకపై ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలు ఏర్పడింది.

C-TET నుంచే అమలు..

డిగ్రీతోపాటు బీఎడ్‌ చేసిన అభ్యర్థులను ప్రైమరీ టీచర్‌ పోస్టులకు అర్హులను చేస్తూ మార్పు చేసిన విధానాన్ని జూలై 7న నిర్వహించనున్న సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (C-TET) నుంచే అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా మార్పులతో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSC) ఇటీవల C-TET నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. NCTE షరతుకు లోబడి డిగ్రీతోపాటు బీఎడ్‌ చేసిన వారు ప్రైమరీ టీచర్‌ పోస్టులకు, 6, 7, 8 తరగతులకు బోధించే ఎలిమెంటరీ టీచర్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) పోస్టులకు అర్హులుగా లెక్కలోకి తీసుకునేలా C-TET నిబంధనలను పొందుపరిచింది.

NCTE 2010లో టెట్‌ నిబంధనలను జారీ చేయకముందు SGT పోస్టులకు Bed అభ్యర్థులను కూడా అర్హులుగానే పరిగణన లోకి తీసుకునేవారు. అయితే బీఎడ్‌ అభ్యర్థులకు చైల్డ్‌ సైకాలజీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సబ్జెక్టు లేనందున వారిని పరిగణనలోకి తీసుకోవద్దని డీఎడ్‌ అభ్యర్థులు అంతకు ముందే కోర్టులో కేసు వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు డీఎడ్‌ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో బీఎడ్‌ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనర్హులుగా NCTE ప్రకటించింది. ఆ తర్వాత టెట్‌ రావడంతో అందులో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్‌ అభ్యర్థులు అర్హులు కాదన్న నిబంధన విధించింది.

కేవలం 6, 7, 8 తరగతులకు బోధించేందుకే బీఎడ్‌ వారు అర్హులని తెలిపింది. దీంతో బీఎడ్‌ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. పైగా రాష్ట్రంలో ప్రస్తుతం బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు 5 లక్షల మందికిపైగా ఉంటే డీఎడ్‌ పూర్తి చేసిన వారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు అనేకసార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో కేంద్రం వారికి అర్హత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Latest Updates