మంత్రి కామెంట్ల వెనుక..  మతలబేంటి ?

‘మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా నెల నెల ఫైనాన్స్​ కమిషన్​ నిధులు ఠంచన్​గా మీ అకౌంట్లలో డిపాజిట్​ అవుతున్నాయి. కాబట్టి తప్పుకుండా మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే మూడు, నాలుగేళ్లలో పూర్తి చేయాలి. ఎన్నికల్లో లింగయ్య మళ్లీ మీ ముందుకువచ్చే నాటికి అన్నింటినీ పూర్తి చేస్తాం’ ఇవీ ఇటీవల జరిగిన చిట్యాల సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు.

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలోని నకిరేకల్​ నియోజకవర్గ అధికార పార్టీలో కొత్త రాజకీయానికి తెర లేచింది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ చిట్యాలలో చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యే అని కేటీఆర్​ సంకేతాలు ఇవ్వడంతో పొలిటికల్​ సీన్​ పూర్తిగా మారిపోయింది. మంత్రి చేసిన కామెంట్లే ఇప్పుడు టిక్ ​టాక్​ వీడియో రూపంలో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా… ఇప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక మతలబు ఏమై ఉండొచ్చని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య టీఆర్​ఎస్​లో చేరినప్పటి నుంచే నియోజకవర్గంలో గ్రూపులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలకు హైకమాండ్ ఫుల్​ పవర్స్​ ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం నేతలు పట్టువీడడం లేదు. హేమాహేమీలైన నేతలు ఉండడడంతో గ్రూపు పాలిటిక్స్ ను నిలువరించలేక పోగా… ఇటీవల కాలంలో మరింత ముదిరాయి.

దారికిరాని వ్యతిరేక వర్గం

మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్​, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ చొరవతోనే ఎమ్మెల్యే చిరుమర్తి టీఆర్​ఎస్​లో చేరడం జరిగిందని ప్రచారంలో ఉంది. చిరుమర్తి రాకతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో జిల్లాలో వరుసగా జరిగిన సర్పంచ్​, లోకల్​ బాడీ, మున్సిపల్​, సహకార ఎన్నికల్లో వీరేశం వర్గీయులు రెబల్స్​గా పోటీ చేయడమే గాక, పలు చోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు హైకమాండ్ వద్దకు చేరుతున్నా స్థానిక పరిస్థితుల్లో మార్పు కనిపించలేదు. ప్రధానంగా కేతేపల్లి, నకిరేకల్​, కట్టంగూరు, చిట్యాలలో వ్యతిరేక వర్గీయులు కొరకరాని కొయ్యగా మారారు. చివరకు జడ్పీచైర్మన్​ బండా నరేందర్​ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నార్కట్​పల్లి మండలంలో కూడా గ్రూపు పాలిటిక్స్​ ముదిరిపోయాయి. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇమేజ్​ను మరింత పెంచే దిశగానే కేటీఆర్​ కామెంట్లు చేసి ఉండొచ్చనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

వీరేశంకు ఇచ్చిన హామీ నెరవేరేనా..!

2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్​లతో పాటు, పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలకు సైతం టీఆర్​ఎస్ హైకమాండ్ టికెట్లు ఇచ్చింది. దీన్ని బట్టి కేటీఆర్​ చేసిన కామెంట్లు చూస్తే వచ్చే ఎన్నికల్లో చిరుమర్తికి ఢోకా లేదనే ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అదే నిజమైతే మాజీ ఎమ్మెల్యే వీరేశం రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది ? కార్పొరేషన్ చైర్మన్​ పదవి ఇస్తామన్న హామీని హై కమాండ్ నిలబెట్టుకుంటుందా ? అన్న సందేహాలు వ్యక్తం మవుతున్నాయి. అయితే వీరేశం విషయంలో పార్టీ పక్కా క్లారిటీతోనే ఉందని ఆయన వర్గం చెప్తోంది. రాష్ట్రంలో కార్పొరేషన్ పదవులు భర్తీ చేయడం మొదలైతే మొదటి లిస్ట్​లోనే వీరేశం పేరు ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఇటీవలి కాలంలో వీరేశం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా జిల్లా ముఖ్య నేతలతో, పార్టీ పెద్దలతో నిత్యం టచ్​లోనే ఉన్నాడని చెప్తున్నారు. ఏదిఏమైనప్పటికీ కేటీఆర్​ కామెంట్లతో నకిరేకల్​లో కొత్త రాజకీయానికి నాంది పలికినట్లేనని సీనియర్​ లీడర్లు అంటున్నారు.

Latest Updates