BEL సైంటిస్టులు: సరిహద్దుల్లో రోబో దళం!

బెంగళూరులోని భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​ (బీఈఎల్​)కు చెందిన సెంట్రల్​ రీసెర్చ్​ లేబొరేటరీ (సీఆర్​ఎల్​) సైంటిస్టులు సరిహద్దు గస్తీ రోబోలను తయారు చేస్తున్నట్టు టైమ్స్‌‌ ఆఫ్‌‌ ఇండియా కథనం పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్​ నాటికి తొలి ప్రొటో టైప్​ను సిద్ధం చేస్తామని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘బలగాలు చేస్తున్న కొన్ని కీలక ఆపరేషన్ల తీరును ఏఐ మార్చేస్తుంది. మేం తయారు చేసే రోబో సరిహద్దుల్లో గస్తీ కూడా కాస్తుంది” అని బీఈఎల్​ సీఎండీ ఎమ్​వీ గౌతమ చెప్పారు. ఈ రోబోతో పాటే మరికొన్ని ఏఐ ఆధారిత సైనిక ఉత్పత్తులు కూడా ఈ ఏడాది చివరి నాటికి చేతికొస్తాయని రక్షణ ఉత్పత్తి సెక్రటరీ అజయ్​ కుమార్​ చెప్పారు. అయితే, కావాల్సిన అవసరాలేంటో మాత్రం ఆర్మీ ఇప్పటిదాకా బీఈఎల్​కు చెప్పలేదన్నారు. స్టీవ్​ జాబ్స్​ చెప్పినట్టు మనం చూపించే దాకా తమకేం కావాలో యూజర్​కు కూడా తెలియదన్నారు. కంపెనీగా ఆర్​ అండ్​ డీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నామని, ఆర్మీకి ఉపయోగపడేలా తమ సామర్థ్యమేంటో ఈ ప్రాజెక్టే చెబుతుందని గౌతమ అన్నారు. ప్రాజెక్టు, డిజైన్స్​ కోసం ప్రాథమిక అవసరాలపై నివేదిక తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఏఐలో ట్రైనింగ్​ ప్రోగ్రామ్స్​ కూడా నిర్వహించినట్టు వివరించారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి సంస్థలైన ఐరోబోట్​ కార్పొరేషన్​, నార్త్​రాప్​ గ్రమ్మన్​ కార్పొరేషన్​, మిత్సుబిషి, థేల్స్​ గ్రూప్​, బీఏఈ సిస్టమ్స్​, జనరల్​ డైనమిక్స్​ కార్పొరేషన్​ వంటివి ఫస్ట్​ రెస్పాండర్​ బోర్డర్​ పాట్రోల్​ రోబోలను తయారు చేస్తున్నాయి. కొరియా మాత్రం అవతార్​ సినిమా స్ఫూర్తిగా యంత్రాలను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, మనదేశంలో ఈ టెక్నాలజీ రావడానికి కనీసం మరో దశాబ్దమైనా పడుతుందని భద్రతా నిపుణులు, మాజీ మిలటరీ కమాండర్లు, మేధో వర్గం సభ్యులు చెబుతున్నారు.

మామూలు యుద్ధాలుండవేమో,,,

భవిష్యత్​ యుద్ధాలు మామూలుగా జరగవని, యుద్ధంలో ఏఐ నిర్ణయాలే ఎక్కువగా ఉంటాయని గౌతమ అంటున్నారు. ప్రస్తుతం సైనికులే సరిహద్దు గస్తీని నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో ఈ రోబో గస్తీ దళంతో సైనికుల ప్రాణాలను కాపాడొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఓ రోబోకు కంపెనీ దాదాపు రూపునిచ్చింది. డిజైన్​లోని సంక్లిష్టతలను క్లియర్​ చేసేందుకు నెక్స్ట్​ జనరేషన్​ ఏఐని వాడనున్నారు. రా డేటా లేనప్పుడు తనంతట తానే సమాచారాన్ని సేకరించేలా రోబోలను తయారు చేయడమే ఇప్పుడున్న పెద్ద సవాల్​ అని గౌతమ చెబుతున్నారు. టాస్క్​లను కచ్చితంగా పూర్తి చేసేలా రోబో ఆల్గారిథంలను కస్టమైజ్​ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ట్రయల్స్..​

ఇప్పుడు తయారు చేస్తున్న రోబోపై అంతర్గత రివ్యూను డిసెంబర్​ నాటికి చేయాలని బీఈఎల్​ భావిస్తోంది. అదయ్యాక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూజర్​ ట్రయల్స్​ నిర్వహించాలనుకుంటోంది. బెంగళూరు, ఘజియాబాద్​లోని సీఆర్​ఎల్​లు, బెంగళూరులోని బీఈఎల్​ సాఫ్ట్​వేర్​ టెక్నాలజీ సెంటర్​ (బీఎస్​టీసీ)కి చెందిన 80 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. రోబోల్లో ప్రత్యేకమైన సెన్సర్లను బీఈఎల్​ పెడుతోంది. విపత్తు ఏర్పడ్డాక కంట్రోల్​ సెంటర్లతో కమ్యూనికేట్​ చేస్తూనే నిఘా పెట్టేలా వాటిని రూపొందిస్తున్నారు. ఒక్కో రోబో ధర ఆర్డర్​ను బట్టి మారుతుంది. చిన్న ఆర్డర్లయితే ఒక్కో రోబోకు ₹80 లక్షలు, పెద్ద ఆర్డర్లయితే ₹70 లక్షలు అవుతుందని గౌతమ తెలిపారు.

Latest Updates