పది కత్తిపోట్లు దిగినా.. బస్సును గమ్యానికి చేర్చిన డ్రైవర్

శరీరమంతా పది కత్తి పోట్లు దిగి రక్తం కారుతున్నా.. ఆ బస్సు డ్రైవర్ ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చాడు. ఆ తర్వాత ఖాళీ బస్సును డిపోకు చేర్చాక గానీ, ఆస్పత్రికి వెళ్లలేదు. ఈ ఘటన గురువారం నాడు బెల్జియంలో జరిగింది.

బెల్జియం దేశంలోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ డీ లిజ్న్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న 58 ఏళ్ల డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బస్సులో జనాల్ని ఎక్కించుకుని లైరే టౌన్‌కు వెళ్తున్న అతడు మధ్యలో కొనిచ్చ్ దగ్గర ఆపి కిందికి దిగి స్మోక్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొట్టలో, కాళ్లు, మెడ సహా పలు చోట్ల పది సార్లు పొడిచి.. పరారయ్యాడు. అతంటి తీవ్ర గాయాలైనా ఆ వృద్ధ డ్రైవర్ మళ్లీ బస్సు ఎక్కి.. మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి ప్రయాణికులను సేఫ్‌గా చేర్చాడు. ఆ తర్వాత ఖాళీ బస్సును ఎక్కడా ఆపకుండా విల్లెబ్రోక్‌లోని డిపోకు చేర్చాడు. కత్తితో పొడిచిన తర్వాత దాదాపు గంటపాటు అతడు బస్సు నడుపుతూనే ఉన్నాడు.

డిపోకు వచ్చిన తర్వాత తోటి ఉద్యోగులు అతడి గాయాలను చూసి వెంటనే అంబులెన్స్ పిలిపించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడికి పాల్పడింది ఎవరు? కారణమేంటన్నది ఇంకా తెలియలేదు.

Latest Updates