ఆర్డర్లే..ఆర్డర్లు : ఊరంతా వంట మాస్టర్లే..

బెల్లంపల్లి చుట్టుపక్కల జన్కాపూర్ ‘వంట మాస్టర్ల’ చేతి వంట తినని వాళ్లే ఉండరు. ఆ ప్రాంతంలో ఏ శుభకార్యం జరిగినా వాళ్లే గరిట తిప్పాలి. వాళ్లు వండిన బాగారన్నం మటన్ తో తింటే మజానే వేరు. సాధారణంగా ఊళ్లలో ఒక్కరో ఇద్దరో వంటమాస్టర్లు ఉంటారు. కానీ, జన్కాపూర్ లో సుమారు ఎనభై మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆ నలభీముల గ్రామంపై ప్రత్యేక కథనం..

బెల్లంపల్లి​, వెలుగు : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కాపూర్ .. నలభై ఏళ్ల క్రితం ఈ ఊరికి చెందిన మంచర్ల సీతారాం శుభకార్యాల్లో వంటలు చేసేవాడు. ఆయన కమ్మగా వండుతాడు అని పేరుండేది. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన్ను తీసుకెళ్లి వంటలు చేయించుకునేవాళ్లు. అలా వెళ్లేటప్పుడు ఆయన తనవెంట కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిని సహాయంగా తీసుకెళ్లేవాడు. అలా వెళ్లిన వాళ్లలో చాలామంది వంట చేయడం నేర్చు కున్నారు. పదిహేనేళ్ల క్రితం సీతారాం చనిపోయాడు. దాంతో ఆయన కొడుకు అశోక్ కూడా తండ్రి చూపిన మార్గా న్నే ఎంచుకున్నాడు. అశోక్ కు కూడా వంట మాస్టర్ గా మంచి పేరుంది. అతడికి ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అలా వెళ్లినప్పుడు అతడితోపాటు కొంతమందిని సహాయంగా తీసుకెళ్తాడు. వాళ్లలో కూడా చాలామందికి వంట నేర్పించి మాస్టర్లుగా తయారు చేశాడు.

ప్రస్తుతం అశోక్ తో పాటు సుమారు ఇరవై మంది వంట మాస్టర్లు పని చేస్తున్నారు . ఆ ఊళ్లో మొత్తం ఎనభై మంది వరకు వంట పనులు చేస్తుంటారు. వాళ్లకు సహాయంగా మరికొంత మంది కూడా వెళ్తుంటారు. కూలీ పనుల కంటే వంట పనులకు వెళ్తేనే గిట్టుబాటు అవుతుంది అంటున్నారు వాళ్లంతా. వీళ్లు వంట చేస్తే ఒక్కో శుభకార్యానికి మూడు వేల రూపాయల నుంచి పదివేల వరకు చార్జ్ చేస్తారు .

వంట చేయడమే పని

బెల్లంపల్లి నియోజకవర్గంలోనే కాదు చుట్టు పక్కల జిల్లా ల్లో కూడా జన్కాపూర్ వంటలు చాలా ఫేమస్ . వాళ్లు బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, కరీంనగర్ , గోదావరిఖని, రామగుండం, హైదరాబాద్ , మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో శుభకార్యాల్లో అర్డర్లపై వంటలు చేస్తారు. జన్కాపూర్ మాస్టర్లు చేసే వంటల్లో మటన్ , బగారా అన్నంతో పాటు చేప పచ్చడి, మటన్ పచ్చడి చాలా ఫేమస్. ఇక శాకాహారం వండడంలోనూ వీళ్లది అందెవేసిన చెయ్యి. అంతేకాదు జన్కాపూర్ వంట మాస్టర్లు తయారు చేసే పచ్చళ్లు అమెరికా తెలుగు వాళ్లు కూడా చాలామంది ఇష్టపడతారు. అందుకే బెల్లంపల్లి చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లు ఈ పచ్చళ్లను కొని అమెరికాలోని వాళ్ల చుట్టాలకు పంపుతుంటారు.

ఆరు నెలలే పని..

అశోక్ అన్న దగ్గర వంట చేయడం నేర్చుకున్న. మూడేళ్లు గా వంట పనులకు వెళ్తు న్నా. సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా ఆరు నెలల్లో అప్పుడప్పుడు ఆర్డర్లు వస్తుంటాయి. – సాయి

సొంతంగా చేస్తున్నా..

గతంలో మా బంధువులతో కలిసి వంటపనులకు వెళ్లేవాడిని. అలా వంట నేర్చుకుని ఇప్పుడు సొంతంగా ఆర్డర్లపై వంటలు చేస్తు న్నా. సీజన్ బట్టి దూర ప్రాంతాలకు కూడా వెళ్లి వంటలు చేస్తుంటాం. -వినోద్

రాష్ట్రమంతా తిరుగుతున్నం

నాకు పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తూ ఉంటాయి. రామగుండం, కరీంనగర్ , గోదావరిఖని, హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాలకు వంట చేసేందుకు వెళ్తుంటా. మటన్, బగారా, చికెన్ బిర్యానీ బాగా వండుతాను అంటుంటారు తిన్నవాళ్లు. నేనే కాదు మాకటుంబంలో అందరూ వంట వృత్తిలోనే ఉన్నారు-సురేష్

Latest Updates