ఆగస్టు 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో పూర్తి లాక్‌డౌన్: పంద్రాగస్టు, బక్రీద్ రోజుల్లో సడలింపు

కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోల్‌కతాలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత అదుపులోకి రాకపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగుతుందని చెప్పారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని, తప్పనిసరి అయితే తప్ప బయకు రావొద్దని సూచించారు. అలాగే రాష్ట్రమంతా ప్రతి వారంలో రెండ్రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ అమలును కూడా ఆగస్టు నెలాఖరు వరకు పొడిగిస్తున్నామని చెప్పారు మమతా బెనర్జీ. అయితే ఆగస్టు 1న ముస్లింల పండుగ బక్రీద్, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంద్రాగస్టు (ఆగస్టు 15) నాడు లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తున్నామని వెల్లడించారు. అయితే ప్రజలంతా కరోనా నిబంధనలను స్వచ్ఛందంగా పాటించాలని ఆమె కోరారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. బక్రీద్ పర్వదినం నాడు ఎక్కడా జనం గుంపులుగా చేరకుండా ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నానని అన్నారు సీఎం మమతా బెనర్జీ. కాగా, రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలయ్యే రోజులను ఆమె ప్రకటించారు. జూలై 29 సహా ఆగస్టు 2, 5, 8, 9, 16, 17, 23, 24, 31 తేదీల్లో పశ్చిమ బెంగాల్ అంతటా సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు చెప్పారు.

Latest Updates