పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. ఓ వ్యక్తి దుర్మరణం

లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్న వారిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. లాక్ డౌన్ పేరుతో ద్విచక్ర వాహనదారుల్ని, ప్రయాణికుల్ని, నిత్యవసర వస్తువుల కోసం వచ్చిన వారిపై పోలీసులు లాఠీ ఝుళిపిస్తున్నారు. తాజాగా పాల ప్యాకెట్ల కోసం వచ్చిన ఓ వ్యక్తిపై లాక్ డౌన్ పేరుతో పోలీసులు దాడి చేశారు. దాడితో బాధితుడు మృతి చెందాడు.

ఇండియా టుడే తెలిపిన వివరాల ప్రకారం..వెస్ట్ బెంగాల్ లో విషాదం చోటు చేసుకుంటుంది.  హౌరా ప్రాంతంలో  నివాసం ఉంటున్న లాల్ స్వామి(32) పాల ప్యాకెట్ల కోసం..స్థానికంగా ఉన్న పాల్  బూత్ దగ్గరకు వచ్చాడు. అదే సమయంలో లాక్ డౌన్ సందర్భంగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు స్వామిని గమనించారు. లాక్ డౌన్ ఉంటే భయట ఎందుకు తిరుగుతున్నావంటూ బాధితుణ్ని ప్రశ్నించారు. అందుకు తాను పాల ప్యాకెట్ కోసం వచ్చానని, ఇంటికి వెళుతున్నట్లు చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాక్ డౌన్ ఉందని తెలిసి కూడా భయట తిరుగుతావా అంటూ లాఠీ ఛార్జ్ చేశారు.  ఈ దాడిలో బాధితుడి స్పృహ కోల్పోయాడు. పోలీసులు దాడిలో గాయపడ్డ బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మరణించారు.

బాధితుడి మరణంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన లాల్ స్వామిని పోలీసులు అకారణంగా చేయి చేసుకున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates