బైకుపై 5 ఖండాల్లో 37 దేశాలు చుట్టొచ్చాడు..కానీ

  • ఒంటెను ఢీకొట్టి.. తలకు గాయం కావడంతో కన్నుమూత

బైకుపై లాంగ్ డ్రైవ్‌లతో సెలబ్రిటీగా మారిన బెంగళూరు వాసి కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ (45) అనూహ్యంగా బైకు ప్రమాదంలోనే కన్నుమూశాడు. బుధవారం రాత్రి బీఎండబ్ల్యూ జీఎస్ బైకుపై రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో ప్రయాణిస్తుండగా ఊహించని రీతిలో ఎదురొచ్చిన ఒంటెను తప్పించబోయి కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి దుర్మరణం పాలయ్యాడు. సెలబ్రిటీ బైకర్ రిచర్డ్ శ్రీనివాసన్ బెంగళూరులో పలు వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వ్యాపారవేత్తగా చిరపరిచితుడు. ఈయనకు భార్య ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బైకుపై సాహసయాత్రలతో మన దేశంలో నే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీనివాసన్ యాదృచ్చికమో కాకతాళీయమో గాని అనూహ్యంగా బైకు ప్రమాదంలోనే కన్నుమూశాడు. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీ బైకర్లలో ఒకడిగా పేరు పొందిన రిచర్డ్ శ్రీనివాసన్ ఇప్పటి వరకు 5 ఖండాల్లోని 37 దేశాలలు చుట్టొచ్చాడు. మొత్తం 65 వేల కిలోమీటర్లకుపైగా సాగిన బైకు ప్రయాణంలో కొండలపై.. మంచు ప్రదేశాల్లో ఎన్నో ప్రమాదకర ప్రాంతాల్లో విజయవంతంగా తన ప్రయాణం ముగించాడు. గత ఏడాది ఆగస్టులో అమెరికాలో బైకు యాత్ర చేసి అక్టోబర్ నెలలో బెంగళూరుకు తిరిగొచ్చాడు. రెండు నెలలు ఇంటి వద్ద వ్యాపారాలు చూసుకుంటూ విశ్రాంతి తీసుకుని తిరిగి యాత్ర చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు.

బెంగళూరు నుంచి లండన్ కు 72 రోజుల్లో బైకు యాత్ర

2018లో బెంగళూరు నుంచి లండన్ వరకు 72 రోజులు బైకు యాత్ర చేశాడు. అటు తర్వాత దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో బైకుయాత్ర సాగించాడు. సాధారణంగా అయితే  ప్రతిరోజు కేవలం 8 గంటలు మాత్రమే యాత్ర చేస్తూ.. దారి పొడవునా చూసిన వింతలు, విశేషాలను డైరీలో నమోదు చేసుకోవడం అలవాటు. దేశాల సరిహద్దులతోపాటు.. ప్రమాదకర ప్రాంతాల్లో రోజుకు 3 లేదా 4 గంటలు మాత్రమే బైకు యాత్ర చేస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ముఖ్యంగా తన యాత్రకు అవసరమైన డబ్బంతా సొంతంగానే సమకూర్చుకుంటాడే తప్ప ఎవరినీ యాచించే అలవాటు లేదంటాడు శ్రీనివాసన్. తాను చూసిన 37 దేశాల్లోకెల్లా చిలీ అందమైన దేశంగా కనిపించిందని కితాబునిచ్చాడు. లండన్ యాత్రకు వెళ్లేటప్పుడు చైనాలో పెట్రోలు దొరకక ఇబ్బందిపడ్డానని.. అలాగే కిర్ఘిస్తాన్ దేశంలో మంచుదుప్పట్లో ముందుకెళ్లే దారికనిపించని ప్రాంతాల్లో జర్నీ చేయడం భయానకం కలిగించినా.. బెదిరిపోలేదు. రష్యాలో వెళ్లేటప్పుడు ఆ దేశ కరెన్సీ లేకపోవడంతో ఆకలితో అలమటిస్తూ.. ఏం చేయాలోనని అయోమయంగా ఉన్నను ఓ మహిళ గమనించి తన ఆకలి తీర్చడం మరపురాని అనుభూతి కలిగించిందని శ్రీనివాసన్ పేర్కొన్నాడు. కొద్ది రోజుల క్రితమే ముగ్గురు మిత్రులతో కలసి యాత్ర చేపట్టిన రిచర్డ్ శ్రీనివాసన్ ఈనెల 23వ తేదీలోగా బెంగళూరుకు తిరిగివచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు రాజస్థాన్ లో బైకుపై నుండి కింద పడి గాయపడి చనిపోవడం సర్వత్రా దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇవీ చదవండి

పెనుకొండలో ప్రత్యక్షమైన వింతపక్షి

ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్నెట్.. సగం ధరకే లాప్‌టాప్

గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి

Latest Updates