బెంగళూరును దేశ విద్రోహ శక్తుల నుంచి కాపాడుకోవాలి

సిటీ టెర్రర్ హబ్‌‌గా మారిందన్న ఎంపీ తేజస్వీ సూర్య

బెంగళూరు: ఉగ్రవాద కార్యకలాపాలకు కర్నాటక రాజధాని బెంగళూరు ప్రధాన కేంద్రంగా మారిందని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. గత కొన్నేళ్లలో బెంగళూరు, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో చాలా టెర్రర్ మాడ్యూల్స్‌‌ను ఛేదించారని తెలిపారు. పలువురు స్పీపర్ టెర్రర్ సెల్స్‌‌తోపాటు మరి కొందరిని అరెస్టు చేశారని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. టెర్రరిస్టు గ్రూపులు ఉగ్ర కార్యకలాపాల కోసం బెంగళూరును ఇంక్యుబేటర్ సెంటర్‌‌లా వాడుకోవాలని చూస్తున్నారని హెచ్చరించారు. సౌత్ ఇండియాకు ఫైనాన్షియల్ సెంటర్‌గా మారిన బెంగళూరు సిటీని టెర్రరిస్టులు, దేశ విద్రోహ శక్తుల నుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశానని.. బెంగళూరులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌‌ఐఏ)ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను కోరానన్నారు. తన వినతికి స్పందనగా బెంగళూరులో ఎస్పీ ర్యాంకు అధికారితో పర్మినెంట్ ఎన్‌‌ఐఏ స్టేషన్‌‌ హౌజ్‌‌ను ఏర్పాటు చేస్తామని షా హామీ ఇచ్చారని తేజస్వీ వివరించారు.

Latest Updates