సొంత ఇంటి ఓనర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు..

సొంత ఇంటి ఓనర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు..

ఇంటి ఓనర్లకు ఎదురవుతున్న సమస్యలను తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని కొన్ని ఇళ్లకు ఇకపై ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) తప్పనిసరి కాదని ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే కొద్దిరోజుల  క్రితం సుప్రీంకోర్టు OC లేని ఇళ్లకు నీరు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వొద్దని ఆదేశించింది. దీంతో లక్షలాది మంది ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యంగా విద్యుత్ కనెక్షన్ల కోసం లక్ష దరఖాస్తులు పెండింగులో పడ్డాయి. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించి ఈ కొత్త ఉత్తర్వును తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జులై 3న  ఒక సమావేశం కూడా నిర్వహించారు.

ఈ మినహాయింపు 1,200 చదరపు అడుగుల లోపు స్థలంలో కట్టిన ఇళ్లకు వర్తిస్తుంది. సాధారణంగా గ్రౌండ్ ఫ్లోర్& రెండు అంతస్తులు లేదా  సెల్లార్/స్టిల్ట్& మూడు అంతస్తులు ఉన్న ఇళ్లకు ఈ వెసులుబాటు ఉంటుంది. దింతో చిన్న ఇళ్ల ఓనర్లు ఇకపై ఇంటి కరెంటు, నీరు, డ్రైనేజీ వంటి సేవలు పొందడానికి OC తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం లేదు.

ఈ మార్పు అమలు కోసం ప్రభుత్వం 'గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ చట్టం, 2024' లోని సెక్షన్ 241(7) కింద అధికారాలను ఉపయోగించుకుంది. అయితే బెంగళూరులో ప్రతి ఏడాది 4వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, ప్రతి ఇంటిని చెక్ చేయడం మున్సిపల్ సిబ్బందికి సాధ్యం కావడం లేదని అధికారులు తెలిపారు. సొంత ఇల్లు లేదా చట్టబద్ధంగా ఇల్లు కట్టుకునేందుకు  ఇంకా అందుకు అనుమతుల ప్రక్రియను సులభం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ మినహాయింపు పెద్ద అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలకి, వివిధ రకాల వినియోగ భవనాలకు వర్తించదు. అలాగే వీటికి OC తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చర్య వేలాది మంది ఇంటి ఓనర్లకు చాల రిలీఫ్ ఇస్తుందని భావిస్తున్నారు.