లైంగిక వేధింపులను ఆపే ‘హీట్ మ్యాప్’

బెంగళూరు నగరంలో అత్యాచారాలు, సెక్సువల్‌‌ హరాస్‌‌మెంట్‌‌ ఎక్కువవుతోందని తెలుసుకున్న ఓ యువతి అలాంటి సంఘటనలు ఆపడానికి ఏమైనా చేయాలనుకుంది. ఆ ఘటనలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయో మహిళలు, యువతులను ఆరా తీసింది. ఆ సమాచారాన్నంతా ఓ మ్యాప్‌‌లో సెట్‌‌ చేసి ‘డిజిటల్‌‌ హీట్‌‌ మ్యాప్‌‌’ను రెడీ చేసింది. దానికి ‘ఇట్స్‌‌ నాట్‌‌ మై ఫాల్ట్‌‌’ అని పేరు పెట్టింది. ఇటీవల విమెన్‌‌ రైట్స్‌‌పై జరిగిన ఓ కాన్ఫరెన్స్‌‌లో ప్రాజెక్టు గురించి వివరించగా విషయం తెలుసుకున్న బెంగళూరు సిటీ పోలీస్‌‌ కమిషనర్‌‌ ఆమెను పిలిచి అలాంటి ఘటనలు జరగకుండా ఆ ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడుతుందో కనుక్కున్నారు. నగరంలో పూర్తి డేటా సేకరించే పని అప్పగించారు. ఆ యువతి పేరు నుపుర్‌‌ పత్ని. బెంగళూర్‌‌లోని సృష్టి ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఆర్ట్‌‌, డిజైన్‌‌ అండ్‌‌ టెక్నాలజీ స్టూడెంట్‌‌.

జరగకుండా ఆపాలని..

దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులకు కఠిన శిక్షలున్నాయి గానీ అసలు అలాంటివి జరగకుండా ఆపడంలో సరైన యంత్రాంగం లేదని నుపుర్‌‌ అన్నారు. మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో పర్మిషన్‌‌ లేకుండానే ఫొటోలు తీస్తుంటారని, తాకుతుంటారని, ఇబ్బంది పెడుతుంటారని.. ఇలాంటి ఘటనలపై ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక మహిళలు సతమతమవుతుంటారని తన పరిశీలనలో తెలిసిందని నుపుర్‌‌ చెప్పారు. యెలహంక దగ్గర్లోని వెస్ట్‌‌ కాలనీని స్టూడెంట్లు రేపిస్ట్‌‌ కాలనీ అంటుంటారని, అక్కడ వీధి లైట్లు ఉండవని, బస్సులు దగ్గర దగ్గరగా పార్క్‌‌ చేసి ఉంచుతారని, యాంటీ సోషల్‌‌ యాక్టివిటీస్‌‌కు అది అడ్డాగా మారిందని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు, ఇలాంటి ప్రాంతాల గురించి, ఘటనల గురించి చెప్పేందుకు ఈ డిజిటల్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ రెడీ చేశానని చెప్పారు. ప్రస్తుతానికి పూర్తి సిటీ వివరాలు లేవని, ఆ సమాచారమంతా తీసుకునేందుకు నుపుర్‌‌తో సహా ఓ స్పెషల్‌‌ గ్రూప్‌‌ను సిద్ధం చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ మ్యాప్‌‌లు త్వరలోనే స్మార్ట్‌‌ ఫోన్‌‌లో అందుబాటులోకి వస్తాయని, బాధితులు ఫోన్‌‌ నుంచి ఇలాంటి ఘటనలను చెప్పొచ్చని వివరించారు.

 

Latest Updates