ఆ కాలేజిలో మతం అడగరు

కాలేజీ అడ్మిషన్ ఫాం మతం కాలమ్ లో మానవత్వం

‘‘మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అన్నారు అభ్యుదయ కవి గురజాడ అప్పారావు. ఆయన మాటలను నిజం చేస్తోంది ఓ కాలేజీ. ప్రయత్నం చిన్నదే కానీ.. వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం చాలా పెద్దది. ఇంతకీ ఆ కాలేజీ ఏం చేసింది? కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని బెథున్ కాలేజీలో మే 27న అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. స్టూడెంట్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కాలేజీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అప్లికేషన్ వస్తుంది. పూర్తి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, నేషనాలిటీ… ఇలా అప్లికేషన్ను నింపుతూ వెళ్తే ‘మతం’ సెక్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనిపించే తొలి కేటగిరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడున్నది ‘మానవత్వం’ అనే రెలీజియన్.  దాని తర్వాత హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియన్, సిక్కిజం, బుద్ధిజం, తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. మతాన్ని నమ్మని వాళ్ల కోసం, చదువుకు మతంతో పని లేదని చెప్పేందుకు కాలేజీ చేసిన ‘చిన్న’ ప్రయత్నం. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.

‘‘తమ మతం గురించి అడ్మిషన్ఫామ్లో పేర్కొనేందుకు కొందరు స్టూడెంట్లు ఇష్టపడరు. ఈ విషయాన్ని మేం గమనించాం. వారి అభిప్రాయాలను అభినందిస్తున్నాం. గౌరవిస్తున్నాం. మానవత్వం మాత్రమే నిజమైన మతం. అందుకే మేం మానవత్వం కేటగిరీని మతం సెక్షన్లో పొందుపరిచాం. అడ్మిషన్ కమిటీ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం ఇది” అని బెథున్ కాలేజీ ప్రిన్సిపల్ మమత రాయ్ చెప్పారు. కాలేజీ చర్యలను స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. ‘ఏదో ఒకరోజు మతం అనే కాలమ్ లేని రోజు వస్తుంది’ అని ఓ ఫేస్బుక్ యూజర్ రాసుకొచ్చారు.

Latest Updates