ఉగ్రవాదుల శవాల్ని పాక్ క్లియర్ చేసింది: ఇటలీ జర్నలిస్ట్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లోని బాలాకోట్ జైషే మహమ్మద్ ఉగ్ర క్యాంపుపై ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ లో 40 – 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని ఇటలీకి చెందిన ఓ జర్నలిస్టు తెలిపారు. 35-40 మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. దాడి జరిగిన ప్రాంతంలోని స్థానికులతో పాటు పాక్ లోని కొందరి నుంచి తనకు పక్కా సమాచారం ఉందని ఆమె చెప్పారు. స్థానికులతో పాటు కొందరు పాక్ జర్నలిస్టులు తనకు సాయం చేశారని వివరించారు.

బాలాకోట్ లో భారత దాడితో చెట్లు ధ్వంసం అవ్వడం తప్ప మరే ఇతర నష్టం జరగలేదని పాక్ ప్రకటించింది. పాక్ మీడియా సహా పలు అంతర్జాతీయ సంస్థలు కూడా అలాంటి కథనాలనే వేశాయి. దీంతో ఎయిర్ స్ట్రైక్ జరిగి వారం గడుస్తున్నా దీనిపై భారత్ లో రాజకీయ పక్షాల ఆరోపణలు కొనసాగుతున్నాయి. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య ఎంత, దాడి ప్రతిఫలం ఎంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటలీ జర్నలిస్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది.

ఇటలీ జర్నలిస్టు మారినో

వియాన్ (WION) మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటలీ జర్నలిస్టు ఫ్రాన్సిస్కా మారినో.. ఎయిర్ స్ట్రైక్ సంబంధించి తనకు ఉన్న సమాచారాన్ని వివరించారు. భారత వాయుసేన చేసిన దాడిలో జైషే టెర్రర్ శిక్షణ క్యాంపులో నిద్రిస్తున్న ఉగ్రవాదులు సుమారు 50 మంది వరకు హతమయ్యారని చెప్పారు. సుమారు 40 మందికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. శిక్షణ తీసుకుంటున్న ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది యువకులేనన్నారు. దాడి తర్వాత పాక్ ఆర్మీ, ఐఎస్ఐ తప్ప స్థానిక పోలీసులను కూడా అక్కడికి ఆ దేశ ప్రభుత్వం అనుమతించలేదని చెప్పారు మారినో. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది ఫోన్లను కూడా ఆర్మీ లాగేసుకుందన్నారు. హతమైన టెర్రరిస్టుల శవాలను క్లియర్ చేశాకే అక్కడికి అంతర్జాతీయ మీడియాను పాక్ ప్రభుత్వం తీసుకెళ్లిందని అన్నారామె.

పాక్ ఆర్మీ మాజీలు కూడా హతం

ఫిబ్రవరి 26న భారత్ వాయుసేన మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో కురిపించిన బాంబుల వర్షంతో టెర్రర్ ట్రైనింగ్ క్యాంపు చాలా వరకు ధ్వంసం అయిందని మారినో చెప్పారు. ఆ సమయంలో అక్కడి నిద్రిస్తున్న 12 మంది జైషే ట్రైనీ ఉగ్రవాదులు మరణించారన్నారు. అలాగే మృతుల్లో పాక్ ఆర్మీ, ఐఎస్ఐ మాజీ అధికారులు కూడా ఉన్నారని చెప్పారు. జైషే ట్రైనర్ ముఫ్తీ మొయీన్, బాంబుల తయీరీ నిపుణుడు ఉస్మాన్ ఘనీ హతమయ్యారని మారినో తెలిపారు.

దాడి జరిగిన ప్రాంతంలో నివసిస్తున్న వారిని పాక్ ఆర్మీ బెదిరించిందని మారినో అన్నారు. వారి నుంచి విషయం బయటకు లాగడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. అయితే తాను కచ్చితంగా దాడికి సంబంధించిన వీడియోలు కూడా సంపాదిస్తానని చెప్పారామె.

ఐఏష్ ఎయిర్ స్ట్రైక్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

Latest Updates