మిడతలు రావొచ్చు జాగ్రత్త!

రంగంలోకి దిగిన ఫారెస్టు ఆఫీసర్లు
వార్ద, నాందేడ్, రాజూర మీదుగా పయనం
అలర్ట్అయిన మిగతా శాఖలు
క్రిమిసంహారక మందులు రెడీ

ఆదిలాబాద్, వెలుగు: మరో మూడు రోజుల నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఎప్పుడైనా మిడతలు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఫారెస్టు ఆఫీసర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. ఫైర్, అగ్రికల్చర్, రెవెన్యూ శాఖలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రలోని వార్ధ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి, నాందేడ్ నుంచి నిర్మల్లోకి ప్రశేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రాష్ట్రంలోకి మిడతల దండు ఎప్పు డైనా వచ్చే అవకాశాలున్నాయని తెలుసుకున్న ఆఫీసర్లు వాటి జాడ తెలుసుకునే పనిలోపడ్డారు. గాలి వీచే దిశ ఆధారంగా ఇటువైపు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. క్రిమిసంహారక మందుతో అగ్రికల్చర్, ఫైర్ ఆఫీసర్లు రెడీ అయ్యారు. మిడతల దిశ స్పష్టమైతే పెస్టిసైడ్ని పిచికారి చేసి కంట్రోల్ చేస్తారు. ఇది కేవలం ఆఫీసర్ల పర్యవేక్షణలోమాత్రమే జరగనుంది. రైతులు పిచికారీ చేస్తే చర్యలు తీసుకుంటారు.

గ్రామ కమిటీల ఏర్పాటు..

మిడతలు ప్రవేశించే ప్రాంతాలు గుర్తించిన సైంటిస్టులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయా గ్రామాల్లో ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి అవగహన కల్పించారు. ఆయా గ్రామాల రైతులను అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ, వ్యవసాయ, అగ్నిమాపక శాఖ ఆఫీసర్లు ఫైర్ ఇంజిన్, ట్రాక్ట‌ర్ ట్యాంకర్ వెళ్లేందుకు పొలాలు, అటవీ ప్రాంతాల దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్ల బోరిలోని నర్సరీని ఓ రైతు చీరలతో ఇలా మొత్తం కప్పేశాడు. మిడతల దండు అటాక్ చేసే ప్రమాదం ఉన్నందున ఇలా చేసినట్లు ఆయన చెప్పారు. 24 గంటల పాటు కాపలా కాస్తున్నట్లు పేర్కొన్నాడు.

రసాయనాలు వాడొద్దు

మిడతలు వస్తున్నట్లు స్పష్టమైతే రసాయనాలు ఆఫీసర్లే దగ్గరుండి పిచికారీ చేయిస్తారు. రైతులు తమకు తెలిసిన మందులను ఎట్టి పరిస్థితుల్లో పిచికారీ చేయొద్దు. వాటి ద్వారా రోగాల బారిన పడే అవకాశాలున్నాయి.            -అల్లంరాజు శ్రీదేవసేన, కలెక్టర్, ఆదిలాబాద్

రెడీగా ఉన్నాం…

మిడతలదండు ఎప్పుడు దండయాత్ర చేసినా… ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రైతులను అప్రమత్తం చేశాం. కలెక్టర్ సూచనల మేరకు క్షేత్త స్థాయిలో మిడతల నివారణకు చర్యలు తీసుకుంటాం.                  -అంజిప్రసాద్, వ్యవసాయాధికారి, నిర్మల్

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates