పురిటి నొప్పులతో 15 గంటలు.. 180 కిలోమీటర్ల జర్నీ..

వాగులు, వంకలు దాటొచ్చింది..
4 ఆస్పత్రులు తిరిగినా చేర్చుకోలేదు..
ఉదయం 6నుంచి రాత్రి 9 వరకు ప్రెగ్నెంట్ అవస్థలు
తెగిపోయినబ్రిడ్జి.. అవతలే ఆగిపోయిన 108
భుజాలపై మోసుకెళ్లి వాగు దాటించిన కుటుంబ సభ్యులు
చివరికి వరంగల్ ఆస్పత్రిలోఅడ్మిట్

భద్రాద్రికొత్తగూడెం/గుండాల, వెలుగు: నిండు గర్బిణి.. పురిటినొప్పులతో బాధపడుతోంది.. ఊరు దాటడానికి దారిలేదు.. వాగు ఉప్పొంగుతోంది.. అంబులెన్స్ అటువైపే ఆగిపోయింది. అయినవాళ్లంతా కలిసి భుజాలపై మోస్తూ వాగు దాటించారు. అంబులెన్స్ ఎక్కి ఆస్పత్రికి వెళ్తే ‘సీరియస్ కేసు’ అని చేర్చుకోలేదు. వేరే ఊరికి వెళ్లాలి.. కానీ అంబులెన్స్ రాలేదు. ఆటో ఎక్కారు.. అప్పటి నుంచి మొదలైంది కన్నీటి జర్నీ. నాలుగు ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్లారు. ఎక్కడా చేర్చుకోలేదు.. చివరికి వరంగల్ లో అడ్మిట్ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలైన ప్రయాణం, రాత్రి 9 గంటలకు వరంగల్ దగ్గర ఆగింది. 15 గంటలపాటు పంటి బిగువున నొప్పిని భరించింది ఆ నిండుచూలాలు. 180 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. వంతెనలు లేని వాగులు.. పరిధి దాటిరాని అంబులెన్సులు.. ఎమర్జెన్సీ సర్వీసులు అందించలేని హాస్పిటల్స్.. కలిసి ప్రెగ్నెంట్ కు ప్రత్యక్ష నరకం చూపాయి.

ఎక్కడా చేర్చుకోలే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళగడ్ల పంచాయతీ పరిధిలోని నర్సాపురం గ్రామానికి చెందిన గర్బిణి నూనావత్ మమతకు శుక్రవారం ఉదయం 6 గంటలకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో డెలివరీ కోసం గుండాల పీహెచ్సీకి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు 108కు ఫోన్ చేశారు. కానీ వర్షాలు, వరదల వల్ల నర్సాపురం, గుండాల గ్రామాల మధ్య మల్లన్న వాగుపై తాత్కాలికంగా వేసిన బ్రిడ్జికొట్టుకు పోయింది. దీంతో 108 వాగు అవతలి వరకే రాగలిగింది. చేసేది లేక మమతను ఇంటినుంచి గ్రామశివారు దాకా నడిపించుకుని వచ్చి, అక్కడి నుంచి భూజాలపై మోస్తూ వాగు దాటించారు. 108 ద్వారా గుండాల పీహెచ్ సీకి మమతను తరలించారు. నొప్పులు ఎక్కువగా వస్తుండడం, ప్రసవం ఇబ్బందికరంగా మారడంతో ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఆమెను డాక్టర్లు ఇల్లెందు ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి సీరియస్ గా ఉందని జిల్లా కేంద్రమైన కొత్తగూడెం హాస్పిటల్ కు రిఫర్ చేశారు. కొత్తగూడెంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయని, అక్కడికి తీసుకెళ్తే కరోనా సోకే ప్రమాదముందని మమత కుటుంబసభ్యులు భయపడ్డారు. దీంతో ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు మహబూబాబాద్ లో చూపించుకున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు ఆటోలో తీసుకెళ్లారు. కానీ కరోనా కారణంగా ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో ఆమెను నర్సంపేటకు అదే ఆటోలో తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు కడుపులో బిడ్డ ఉమ్మనీరు మింగిందని వెంటనే వరంగల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో నొప్పులతో బాధపడుతున్న మమతను ఆటోలోనే వరంగల్లోని సీకేఎమ్ హాస్పిటల్ కు రాత్రి 9 గంటలకు తరలించి, చికిత్స ప్రారంభించారు. గుండాల నుంచి ఇల్లెందు, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా సుమారు 15 గంటలపాటు వరంగల్ వరకు దాదాపు 180 కిలోమీటర్లు ప్రయాణించింది.

ఎంక్వైరీకి కలెక్టర్ ఆదేశం
డెలివరీ కోసం ప్రెగ్నెంట్లు ప్రమాదకర పరిస్థితుల్లో మల్లన్న వాగు దాటిన ఘటనలను కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. వారికి తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆఫీసర్లను ప్రశ్నించారు. ఎంక్వైరీ చేసి, సమగ్ర వివరాలు అందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. వారికి మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

For More News..

ఆర్టీఏలో..ఇంటినుంచే మరో 5 సేవలు

Latest Updates