భద్రాద్రి రామయ్యకు వంటిల్లు లేదు

భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆలయంలో ఉదయం బాలభోగం, మధ్యాహ్నం రాజభోగం, రాత్రి భోగం నివేదిస్తారు. వీటిని ఆలయంలోని ప్రత్యేక వంటశాలలో తయారు చేయాల్సి ఉంటుంది. అయితే భద్రాచలం సీతారామచంద్ర స్వామికి శాశ్వత వంటశాల లేకపోవడంతో ఇరుకుగదిలో ప్రాకార మండపంలో స్వామివారికి నివేదనలు తయారు చేస్తున్నారు. శాశ్వత వంటగది నిర్మాణానికి ఎన్నిసార్లు ప్రతిపాదనలు రూపొందించినా కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. గతంలో సీతారామచంద్రస్వామికి భద్రుని మండపం పక్కనే ఉన్న యాగశాల వద్ద వంటశాల ఉండేది. 2001లో అగ్ని ప్రమాదం జరిగి వంటశాల పూర్తిగా కాలిపోయింది. దీనితో భద్రుని మండపం పక్కనే ఉన్న ప్రాకార మండపంలోకి వంటశాలను మార్చారు. అది ఇరుకుగా ఉంటుంది. పొయ్యిలు కూడా పాడైపోయాయి. ఈ గదిలో గచ్చు బాగో లేదు. అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి ఇక్కడ సిలిండర్లు ఏర్పాటు చేశారు. అందులో గ్యాసు లేక నిరుపయోగంగా మారాయి. స్వామి వారికి నివేదనలు తయారుచేసే ప్రాంతం విశాలంగా, శుభ్రంగా, అనేక సౌకర్యాలతో కూడి ఉండాలి. కానీ ఇవేం వంటశాలలో కన్పించడం లేదు.

నిత్యం నైవేద్యాల తయారీ

స్వామివారికి నిత్యం ఉదయం బాలభోగం తయారు చేస్తారు. సుప్రభాత సేవ అనంతరం రాములవారికి కట్టె పొంగళి 2 కిలోలు, దద్దోజనం కిలో, బెల్లం పొంగళి కిలో, చక్కెర పొంగళి, పులిహోర 20 కిలోలు నివేదిస్తారు.  వీటిని ఈ వంటశాలలోనే తయారు చేస్తారు. ఇక మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజభోగం 12 కిలోలు తయారు చేస్తారు. 12 కిలోల బియ్యం, అరకిలో పెరుగు, కూరగాయలు కిలో, కందిపప్పు కిలో, సాంబారు తయారీకి అరకిలో కూరగాయలు, పసుపు, కారం, బెల్లం, నూనె, తాలింపు దినుసులు అన్నీ కలిపి వండుతారు. వీటితో స్వామికి రాజభోగం సమర్పిస్తారు. దర్బారు సేవలో స్వామికి కిలో శనగలు, కిలో కట్టె పొంగళి, 100 వడలు, 50 అప్పాలు, 100 చిట్టిగారెలు తయారు చేసి నివేదిస్తారు. ఇవి కాకుండా ప్రత్యేక ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి సమయంలో నిర్వహించే విశ్వరూప సేవకు స్వామికి కదంబం ప్రసాదం తయారు చేస్తారు. శ్రీరామనవమి సమయంలో గరుడ పటాన్ని అధిరోహించే ముందు గరుడముద్దలు నివేదిస్తారు. వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. స్వామి వారికి ప్రత్యేకంగా తయారు చేసి నివేదించిన ప్రసాదాలను భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తితో స్వీకరిస్తారు.

ఏటా రూ. కోట్లతో పనులు

ప్రతి సంవత్సరం ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలకు రూ.2 కోట్లతో ఇంజనీరిం గ్‍పనులు చేస్తుంటారు. ఆలయ ప్రాకారాలకు రంగులు, తాత్కాలిక నిర్మాణాలు.. ఇలా అనేక పనులు జరుగుతాయి. కానీ దేవునికి నివేదనలు తయారు చేసే వంటశాల నిర్మాణానికి మాత్రం పైసా కేటాయించడం లేదు. నిత్యం అధికారుల కళ్ల ముందే సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్వామివారికి శాశ్వత వంటశాల నిర్మాణంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

Latest Updates