లీకుల భగీరథ.. క్వాలిటీ లేక పగులుతున్న పైపులు

రిపేర్లకు మస్తు టైం తీసుకుంటున్న వర్క్​ ఏజెన్సీలు

తాగేనీళ్లలో పాకురు, చెత్తాచెదారం, వాసన

(వెలుగు, నెట్​వర్క్​): ఇంటింటికీ ప్యూర్​ అండ్​ సేఫ్టీ వాటర్​ అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్​ భగీరథ స్కీంలో క్వాలిటీ లోపాలు బయటపడుతున్నాయి. ట్రీట్​మెంట్​ ప్లాంట్ల​ నుంచి సెగ్మెంట్లకు వెళ్లే  మెయిన్​ పైపులైన్లతో పాటు ఇంట్రా పైపులైన్లు ప్రెషర్  తట్టుకోలేక రోజూ ఏదో ఒక చోట పగులుతూనే ఉన్నాయి. రిపేర్​ చేసేందుకు వారాలకు వారాలు పడుతుండడంతో అన్ని రోజులూ గ్రిడ్​ పరిధిలోని ఏరియాలకు తాగునీరు అందట్లేదు. మరోవైపు తరచూ లీకేజీల కారణంగా మురికి, చెత్తా చెదారం, వాసన వస్తోందని, ఆ వాటర్​ను తాగలేకపోతున్నామని జనం చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 99 నియోజకవర్గాల్లోని 23,968 వేల హ్యాబిటేషన్లకు నిరంతరం వాటర్​ సప్లయ్​ చేసేందుకు కొత్తగా  లక్షా 5 వేల కిలో మీటర్ల మేర పైపులైన్​ వేశారు. ఇందులో ట్రీట్​మెంట్​ ప్లాంట్ల​ నుంచి సెగ్మెంట్లకు వెళ్లే మెయిన్​ ట్రంక్ ​ లైన్లతో పాటు ఇంట్రా పైపులైన్లు ఉన్నాయి. రూరల్​ ఏరియాల్లో 55.95 లక్షల ఇండ్లకు, అర్బన్​ ఏరియాల్లో 12.83 లక్షల ఇండ్లకు కనెక్షన్​ఇవ్వాలనేది టార్గెట్​. కాగా, 98 శాతం వర్క్స్​ కంప్లీట్​ అయినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. మెయిన్​  గ్రిడ్​ పనులు దాదాపు పూర్తికావచ్చినా పలుచోట్ల ఇంట్రా పైపులైన్​ పనులు కొనసాగుతున్నాయి. మిషన్ భగీరథ ట్రంక్ లైన్లతోపాటు మేజర్ డిస్ట్రిబ్యూటరీ పనులను మేఘా, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, ఐహెచ్​పీ, మాక్స్ ఇన్ ఫ్రా సహా పలు ఏజెన్సీలు దక్కించుకున్నాయి. పైపులైన్​  పనులు చేపట్టిన వర్క్ ఏజెన్సీలే ఐదేండ్లపాటు సొంత ఖర్చులతో ఆపరేషన్​, మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత  ఐదేండ్లలో రిపేర్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది. మొత్తంగా వర్క్ ఏజెన్సీలు పదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. భగీరథ ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​ కోసం ప్రతి మండలానికి ఒక టీమ్ ఏర్పాటు చేశారు. ఇక ఇంట్రా పైపులైన్ల ఏర్పాటును ఎక్కడికక్కడ లోకల్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లకు అప్పగించారు.

తరచూ లీకులు

పైపుల క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఆఫీసర్లు చెప్తున్నప్పటికీ రోజూ మిషన్​ భగీరథ పైపులు ఎక్కడో ఓ చోట పగులుతూనే ఉన్నాయి. మెయిన్​ రోడ్ల వెంట ట్రంక్​ లైన్లు కూడా పగిలి నీళ్లు ఫౌంటెయిన్లలా ఎగజిమ్ముతున్నాయి.

ఏజెన్సీలకు ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్ స్టాఫ్​ సరిపడా లేక, ఉన్నవారికీ సరైన ఎక్స్​పీరియన్స్​ లేక పైపుల కెపాసిటీకి మించి వాటర్​ను పంపడంతో ప్రెషర్​ పెరిగి, పగుళ్లు, లీకులు ఏర్పడుతున్నాయని ఆఫీసర్లు అంటున్నారు. అర్బన్​, రూరల్​ ఏరియాల్లో ఇంట్రా పైపులైన్లు తక్కువ లోతులో వేయడం, పైపులు క్వాలిటీ లేకపోవడం, పాత పైపులకు కనెక్షన్లు ఇస్తుండడంతో హెవీ వెహికల్స్​ వెళ్లినా, సీసీ రోడ్లు, కేబుల్స్​ కోసం ఏ కొద్దిగా తవ్వినా ఎక్కడికక్కడ పగులుతున్నాయి. దీంతో ఆయా హ్యాబిటేషన్లకు రోజుల తరబడి వాటర్​ నిలిచిపోతున్నాయి. ఎక్కడ పైపు​ పగిలినా 48 గంటల్లో రిపేర్​ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీపై ఉన్నా రెండు, మూడురోజులు పడుతోంది. కానీ మళ్లీ వాటర్​ ఫ్లో అందుకొని చివరి హ్యాబిటేషన్లకు చేరేందుకు వారాలు పడుతోందని జనం చెబుతున్నారు.

జిల్లాల్లో ఇట్లా…

కరీంనగర్ జిల్లాలో పైపులు తరుచూ పగులుతున్నాయి. కరీంనగర్– జగిత్యాల మెయిన్​ రోడ్డు వెంట దేశరాజ్ పల్లి శివారులో కొద్దిరోజుల  కింద  మిషన్ భగీరథ పైపులు పగిలి, పలు ఊళ్లకు రోజుల తరబడి వాటర్​  సప్లై నిలిచిపోయింది. వెలిచాల, గట్టుభూత్కూర్, రామడుగు, వెదిర, ఇలా చాలా గ్రామాల్లో పైపులు తరుచూ లీకవుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెంకట్రావ్ పేట వద్ద డిసెంబర్​ 13న  రాత్రి మెయిన్​పైపు​లైన్​ పగిలి, పక్కనే ఉన్న ఇండ్లలోకి  వరద రావడంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఘటన తర్వాత కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు మూడురోజులు నీటి సరఫరా బందైంది.

వరంగల్  అర్బన్  జిల్లాలో 207 హాబిటేషన్లకు వాటర్​ ఇస్తున్నట్లు చెబుతున్నా అన్నిచోట్లా పనులు ఇన్​కంప్లీట్​గా ఉన్నాయి.  గ్రేటర్​ వరంగల్​లో పాత 1.10 లక్షల కనెక్షన్లకు తోడు కొత్తగా అమృత్​ స్కీం కింద 75 వేల కనెక్షన్లు ఇచ్చారు.183 స్లమ్​ ఏరియాల్లో వాటర్​ సప్లయ్​ సిస్టం కరెక్ట్​ లేదు. సిటీలోని నయీంనగర్​, భీమారం, సర్క్యూట్ హౌస్​ రోడ్డు, మచిలీ బజార్​, పోచమ్మకుంట, పెద్దమ్మగడ్డ, కాశీబుగ్గ, లేబర్​ కాలనీ, రంగశాయిపేట, శంభునిపేట, సంతోషిమాత టెంపుల్​ ఏరియా తదితర ప్రాంతాల్లో లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఓ వైపు రిపేర్​ చేస్తుంటే మరో వైపు లీకవుతుండడంతో ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 90 శాతం పనులు కంప్లీట్ అయ్యాయని ఆఫీసర్లు చెబుతున్నా చాలా ఊళ్లకు వాటర్​ వస్తలేవు. తక్కువ లోతులో పైపులు వేయడంతో చిన్నచిన్న వ్యవసాయ పనులు చేసేటప్పుడు పైపులు పగిలి సప్లయ్​ నిలిచిపోతోంది. కామారెడ్డి జిల్లాలోని పలు ఊళ్లలో నల్లాల బిగింపు వర్క్స్  నడుస్తున్నాయి. ఎస్సారెస్పీ నుంచి కామారెడ్డికి వాటర్ తీసుకొచ్చే ట్రంక్​ పైపులైన్లతో పాటు ఇంటర్నల్ పైపులైన్లు తరచూ పగులుతున్నాయి. లీకేజీల కారణంగా రోడ్లపై నీళ్లు పారుతున్నాయి.

మెదక్  జిల్లాలోని 20 మండలాల్లో భగీరథ పైపులైన్ పనులు పూర్తి కాగా.. సీసీరోడ్లు, ఫైబర్​గ్రిడ్​ కోసం తవ్వడంతో చాలా ఊళ్లలో పైపులు పగిలాయి. నేషనల్ హైవే నిర్మాణం వల్ల కౌడిపల్లి, కొల్చారం మండలాల పరిధిలో పైప్ లైన్లు దెబ్బతిని పలు ఊళ్లలో నీటి సరఫరాకు ఆటంకం కలుగుతోంది. సిద్దిపేట జిల్లాలోని మొత్తం 754  హ్యాబిటేషన్లకు నీళ్లు ఇస్తున్నారు. కానీ రోజూ ఏదో చోట పైపులు పగడం, లీకులు బయటపడుతుండడం సమస్యగా మారింది.

మహబూబ్​నగర్​ జిల్లాలో ఇటీవల మహబూబ్​నగర్-– జడ్చర్ల రోడ్డులో పైపులు పగిలి రెండ్రోజులు మహబూబ్​నగర్​కు వాటర్​ సప్లయ్​ నిలిచింది. నాగర్​కర్నూల్​ జిల్లాలో లీకులు ఎక్కువగా ఉన్నాయి. నీళ్లు వాసన వస్తున్నందున తాగట్లేదని జనం చెప్తున్నారు.

యాదాద్రి జిల్లాలో చాలాచోట్ల భగీరథ నీళ్ల ఫ్లో సరిపోక లోకల్​గా ఉన్న బోర్ల నీటిని కలిపి సప్లయ్ చేస్తున్నారు. లీకేజీల వల్ల కొన్ని చోట్ల  మురికి నీళ్లు వస్తున్నాయని జనం అంటున్నారు. దీంతో ఆర్వో​ వాటర్​ కొనుక్కుని తాగుతున్నారు.

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెంకట్రావ్ పేట వద్ద డిసెంబర్​ 13 అర్ధరాత్రి మెయిన్​ పైపు​లైన్​​ పగిలింది. పక్కనే ఉన్న ఇండ్లలోకి వాటర్​ వరదలా ముంచెత్తడంతో బాధితులు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో చాలా మండలాల్లో మురికినీళ్లు వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో రోడ్డు వర్క్స్​ జరుగుతున్న చోట్ల పైపులైన్లు పగలడం, లీకేజీ వల్ల చాలా ఊళ్లలో వాటర్​ సప్లయ్​ జరగట్లేదు. నిర్మల్ జిల్లాలో 396 ఊళ్లకుగాను 250 ఊళ్లకు నీళ్లు​ సప్లయ్​ చేస్తున్నారు. చాలా చోట్ల పైప్ లైన్లు పగిలి నీళ్లు వృథాపోతున్నాయి. తరచూ లీకేజీతో రోజులకొద్దీ వాటర్​ నిలిచిపోతోందని పబ్లిక్​ అంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో చాలా ఊళ్లకు రెగ్యులర్​గా వాటర్​ రావట్లేదు. పైప్​లైన్​ లీకేజీల వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని పబ్లిక్​ తాగుతలేరు. జైనూర్ మండల కేంద్రంలో డ్రైనేజీలోనే పైపులైన్​ లీకవుతున్నా పట్టించుకోవట్లేదని జనం మండిపడుతున్నారు. దహెగాం మండలానికి వాటర్​ సప్లయ్​ జరిగే రిజర్వాయర్​లో ఎవరో చనిపోయారని ప్రచారం జరగడంతో  కొద్దిరోజులుగా పబ్లిక్​ భగీరథ నీళ్లు తాగట్లేదు.

బ్యాడ్ స్మెల్ వస్తోంది

తుర్కపల్లికి మిషన్ భగీరథ వాటర్ వస్తోంది. ఈ వాటర్ ఒక్కోసారి రంగుమారి, బ్యాడ్ స్మెల్ వస్తున్నయ్. అలాంటి వాటర్ తాగితే రోగాలు వస్తాయనే భయంతో తాగుతలేం.

– ఆకుల శేఖర్, తుర్కపల్లి (యాదాద్రి, జిల్లా)

మంచియో కాదో తెల్వక తాగుతలేం

మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లు కరెక్టుగా సప్లయ్ అయితలేవ్.  మా వాడకు నాలుగు రోజులకు ఒక్కసారి వస్తున్నయ్. నీళ్లు మంచియో కాదో తెల్వక తాగుతలేం. బయటి పనులకు వాడుకుంటున్నం.

– మల్లయ్య, గ్రామస్తుడు, బోదం పల్లి, కౌటాల మండలం, ఆసిఫాబాద్​ జిల్లా

భగీరథ నీళ్లతో బట్టలు ఉతుక్కుంటన్నం

మిషన్ భగీరథ నీళ్లు తాగుతలేం. అవి దూరం నుంచి వస్తయ్. నీళ్లలో ఒకోసారి పాకురొస్తది. బాగా చూస్తేగానీ కనిపించనంత చిన్న, చిన్న పురుగులు ఉంటున్నయ్. ఆ నీళ్లను బట్టలు ఉతుక్కోడానికి, సామాన్లు, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వాడుకుంటున్నం. తాగడానికి వాటర్ ప్లాంట్ నుంచి రోజూ క్యానులో నీళ్లు తెచ్చుకుంటున్నం.

– రోండ్ల  శ్రీనివాస్ రెడ్డి, దబ్బగుంట పల్లి, బచ్చన్నపేట మండలం

మురికి నీరు కలుస్తోంది 

ముత్యంపేట దారిలో శ్మశానవాటిక వాగు దగ్గర  పైపు లీకై మురికి నీళ్లు కలుస్తున్నయ్. అందుకే ఆ నీటిని తాగలేక దూరం నుంచి బోరునీళ్లు తెచ్చుకొని తాగుతున్నం. గతంలో మాకిచ్చిన పాతబోరు నీళ్లే మంచిగున్నయ్. ఆ బోరునీళ్లే ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేయాలి.

– సుజత, ముత్యంపేట కాలనీ, బజార్ హత్నూర్, ఆదిలాబాద్​ జిల్లా

ఎటుచూసినా పగుళ్లు, లీకులే..

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో మిషన్​భగీరథ పైపులైన్​లో ఎక్కడ చూసినా పగుళ్లు, లీకులే కనిపిస్తున్నాయి. ఓ దగ్గర పగిలిన పైపులకు రిపేరు చేయగానే మరో చోట పగులుతున్నాయి. రామడుగు మండలం దేశరాజ్​పల్లి శివారులో, వెలిచాల శివారులోని కావేరి జిన్నింగ్ మిల్ దగ్గర, గట్టుభూత్కూర్ కు వెళ్లే దారిలో, వెదిర గ్రామంలో రామడుగు ఎక్స్ రోడ్డు వద్ద , కరీంనగర్, జగిత్యాల హైవే పక్కన.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్పాట్లు ఉన్నాయి. తాజాగా గుడ్డేలుగులపల్లి  శివారులో పైపు లీకై నీరంతా రోడ్డుమీద పారుతోంది. ఇలా తరుచూ పైపులు లీకవుతుండడంతో వారానికోసారి కూడా నీళ్లు వస్తలేవని పబ్లిక్​ అంటున్నారు.

సీఎం ఇలాకాలో ఇదీ తీరు..

సీఎం కేసీఆర్​ సొంత జిల్లా సిద్దిపేటలోని కోహెడ మండలం గాగిల్లాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై భగీరథ పైప్ లైన్ వారం కింద పగిలింది.  దీంతో 71 హ్యాబిటేషన్లకు మూడు, నాలుగు రోజులపాటు వాటర్​సప్లయ్​ నిలిచిపోయింది. ఇదే జిల్లాలో గజ్వేల్– తూప్రాన్ రోడ్డు వెంట ఉన్న భగీరథ పైపులు వర్గల్ మండలం బొర్రాగూడెం వద్ద నెలలో కనీసం రెండుసార్లు పగులుతున్నాయి. దీంతో ఈ మండలంలోని నాచారం, అనంతగిరిపల్లి, వేలూరు, సీతారాంపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో తరచూ తాగునీటి సమస్య తలెత్తుతోంది. పైపులైన్ పనుల్లో క్వాలిటీ లేకనే పగులుతున్నాయని ఆఫీసర్లు గుర్తించారు.

పబ్లిక్​ సఫరవుతున్నరు

భగీరథ పైపులు లీకవుతున్నయ్. నా 8 వ డివిజన్​లోనే 55 చోట్ల లీకేజీలున్నయ్. వాటరంతా వేస్ట్​గా పోతాంది. సప్లై సరిగ్గా లేక పబ్లిక్​ సఫరవుతున్నరు. వారికి సమాధానం చెప్పలేకపోతున్న.

– ఇటీవల గ్రేటర్​ వరంగల్​ కౌన్సిల్​ మీటింగ్​లో టీఆర్​ఎస్​ ​ కార్పొరేటర్​ దామోదర్​ యాదవ్

For More News..

ఫ్రూట్ మార్కెట్ వేస్ట్ నుంచి కరెంట్

రాష్ట్రమంతా నేడు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ డ్రై రన్‌‌‌‌‌‌‌‌

రెండు షిఫ్టుల్లో ఇంటర్ కాలేజీలు! కొంతమందికి ఉదయం.. మరికొంతమందికి మధ్యాహ్నం..

Latest Updates