భారత్ బచావో సభ: ‘మోడీ ఉంటే.. ఈ సమస్యలు కామన్’

మోడీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ.. భారత్ బచావో పేరుతో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో సోనియాగాంధీ మోడీ సర్కారుపై ఫైరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా పార్లమెంటును కాని, వ్యవస్థల గురించి కాని పట్టించుకోవట్లేదని, అసలు విషయాలను దాచిపెట్డడమే వారి ప్రధాన ఎజెండా అని ఆమె దుయ్యబట్టారు. మోడీ, షాలిద్దరూ రాజ్యాంగాన్ని  అపహాస్యం చేస్తున్నారని ఆమె అన్నారు. వారు ఇచ్చిన హామీ మేరకు నల్లధనాన్ని ఎందుకు తీసుకు రాలేపోయారనే విషయమై దర్యాప్తు ఎందుకు జరుపకూడదని ఆమె ప్రశ్నించారు.

రేప్‌ ఇండియా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా

ఇక.. నిన్న పార్లమెంట్ లో జరిగిన వివాదంపై స్పందించారు రాహుల్ గాంధీ. తాను రాహుల్ సావర్కర్ ను కాదని.. రాహుల్ గాంధీని.. అని సమాధానమిచ్చారు. నిజం మాట్లాడితే క్షమాపణ చెప్పాలా అంటూ మోడీ గవర్నమెంట్ ను ప్రశ్నించారు.  రేప్‌ ఇండియా వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని,  ప్రధాని మోడీ, అమిత్‌షాలే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు కోలుకోలేనంత పెద్ద దెబ్బ కొట్టారని ఆయన అన్నారు. పేదల జేబుల్లోని డబ్బులు లాక్కుని పెద్దవాళ్లకు మోడీ పంచిపెట్టారని రాహుల్‌ అన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదు కానీ, పెద్దవారికి వేలకోట్ల రూపాయిల బకాయిలు మాఫీ చేశారని ఆయన అన్నారు. మోడీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నదని ఆయన అన్నారు

కొత్త ఉద్యోగాలు ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు పోయాయి

మోడీ ఉంటే.. నిరుద్యోగం, కేజీ 100 రూపాయలకు ఉల్లి, ఆర్థిక సమస్యలు కామన్ అన్నారు ప్రియాంక. అందరూ కలిసి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. జీఎస్టీతో వ్యాపారులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను దారుణంగా మార్చేశారని ఆమె విమర్శించారు. ఆరేళ్ల వారి పాలనలో కొత్త ఉద్యోగాలు సంగతి ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు పోయాయని ఆమె అన్నారు. ఇవన్నీ బీజేపీతోనే సాధ్యమయ్యాయని ప్రియాంక ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు సహా కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యాయి.

bharat bachao rally: congress leaders comments on Modi government policies

Latest Updates