భారత్‌ బయోటెక్‌ ఫౌండర్‌ కృష్ణ ఎల్లా జర్నీలో 140 పేటెంట్లు

భారత్‌ బయోటెక్‌ ఫౌండర్‌ కృష్ణ ఎల్లా జర్నీలో 140 పేటెంట్లు

భారత్‌ బయోటెక్‌ ఫౌండర్‌ కృష్ణ ఎల్లా సైన్సును ఎంతో ప్రేమిస్తారు. పరిశోధనలకు ప్రాణమిస్తారు. ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితాలను అందుకున్నారు.  తన రంగంలో లెక్కలేనన్ని విజయాలు సాధించారు. దాదాపు 12 వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇండియాలో తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసి రికార్డు సృష్టించారు. భారత్‌ బయోటెక్‌ ఖాతాలో వందకుపైగా పేటెంట్లు కూడా ఉన్నాయి. 

వెలుగు, బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌:2020... ఏప్రిల్​ నెల... నేషనల్‌‌ హైవే 65 మీదుగా గత ఏడాది ఏప్రిల్‌‌లో ఒక వెహికల్‌‌ దూసుకెళ్తోంది. రోడ్డు ఖాళీగానే ఉంది కానీ డ్రైవర్‌‌ అతి జాగ్రత్తగా డ్రైవ్‌‌ చేస్తున్నాడు. ఎందుకంటే తను తీసుకెళ్తున్నది అతి ముఖ్యమైనది.  ఆ వెహికల్‌‌లో ఉన్నది కరోనా వైరస్‌‌ లైవ్‌‌ స్ట్రెయిన్‌‌. వైరస్‌‌ పరీక్షల కోసం దానిని  భారత్‌‌ బయోటెక్‌‌కు సేఫ్‌‌గా తీసుకెళ్లిన క్షణాలవి.  సరిగ్గా ఎనిమిది నెలల తరువాత భారత్‌‌ బయోటెక్‌‌ ఫౌండర్‌‌ కృష్ణ ఎల్లా కరోనాకు వ్యాక్సిన్‌‌ కనిపెట్టినట్టు ప్రకటించారు. దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రధాని సహా ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. తెలుగువారికి గర్వకారణంగా నిలిచారు. దేశంలో తొలిసారిగా కరోనా వ్యాక్సిన్‌‌ డెవెలప్‌‌ చేసిన హైదరాబాద్‌‌ కంపెనీగా భారత్‌‌ బయోటెక్‌‌ను రికార్డులకు ఎక్కించారు. అయితే మొదట్లో కొన్ని అవమానాలు తప్పలేదు. మూడోదశ ప్రయోగాలు చేయకముందే వ్యాక్సిన్‌‌ ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. భారత్‌‌ బయోటెక్‌‌ తయారు చేసిన కోవాగ్జిన్‌‌ నీళ్ల వంటిది మాత్రమేనని సీరమ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ సీఈఓ అదర్‌‌ పూణావాలా వంటి వాళ్లు ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మండిపడ్డారు. ఇలాంటి కామెంట్స్ సరికావని అన్నారు. కొంతకాలం తరువాత అన్ని రకాల డేటాను అందించారు. వ్యాక్సిన్‌‌ పూర్తిగా సురక్షితమని నిరూపించి అందరి నోళ్లూ మూయించారు.  నిజానికి కృష్ణ ఎవరినీ నొప్పించకుండా మాట్లాడుతారు. పూణావాలా కామెంట్స్‌‌ మాత్రం ఆయనను చాలా బాధించడంతో గట్టిగా బదులిచ్చారు. 

పనంటే ప్రాణం...

కృష్ణ తన పనిని ప్రాణంలా భావిస్తారు. కొత్త వాటిని కనిపెట్టడానికి అత్యంత ఇంపార్టెన్స్‌‌ ఇచ్చే సైంటిస్టని భారత్‌‌ బయోటెక్‌‌ ఉద్యోగులు చెబుతారు. తనకు బిజినెస్‌‌మన్‌‌ అనే ట్యాగ్‌‌ కంటే సైంటిస్టనే గుర్తింపు ఇష్టమని అంటారు. అందుకే ఆయన అందరికంటే ముందు రోటా వ్యాక్సిన్‌‌ తయారు చేయగలిగారు. ఎన్నో దేశాలు దీనిని వాడుతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు తగ్గాయి. మనదేశంలోనే ఏటా 1.53 లక్షల మంది చిన్నారులు రోటావైరస్ వల్ల మరణించారని డబ్ల్యూహెచ్‌‌ఓ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌‌ కంపెనీ అయిన సీరమ్‌‌కు భారత్‌‌ బయోటెక్‌‌ రోటావ్యాక్‌‌తో సవాల్‌‌ విసిరినట్టయింది. అంతేకాదు దీనికిముందు హెపటైటిస్‌‌ బి కోసం వ్యాక్సిన్‌‌ కూడా డెవెలప్‌‌ చేశారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌‌ తెచ్చిన మొదటి కంపెనీ భారత్‌‌ బయోటెకే కావడం గమనార్హం. వీటితోపాటు మరెన్నో వ్యాక్సిన్లనూ, థెరాప్టిక్స్‌‌, బయో–థెరాప్టిక్స్‌‌ను లాంచ్‌‌ చేసింది. టైఫాయిడ్‌‌కు కూడా వ్యాక్సిన్‌‌ తయారు చేసింది. స్వైన్‌‌ ఫ్లూ, పోలియో, జపనీస్‌‌ ఎన్సెఫలిటీస్‌‌, జికా, మలేరియా వంటి 12 రకాల వ్యాధులకు భారత్‌‌ బయోటెక్‌‌ వ్యాక్సిన్లను కనిపెట్టి ప్రపంచంలోని ముఖ్యమైన బయోటెక్‌‌ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో చాలా వరకు విఫలమవుతుంటాయి కానీ భారత్‌‌ బయోటెక్‌‌లో ఫెయిల్యూర్‌‌ రేటు చాలా తక్కువని సెంట్రల్‌‌ డ్రగ్స్‌‌ స్టాండర్డ్‌‌ కంట్రోల్‌‌ ఆర్గనైజేషన్‌‌ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌‌ జనరల్‌‌ ఒకరు అన్నారు. 


భారత్‌‌‌‌ బయోటెక్‌‌ సాధించిన విజయాలు


1998: ప్రపంచంలోనే తొలిసారిగా హెపటైటిస్‌‌ బీ వ్యాక్సిన్‌‌ను తయారు చేసింది 
2002: బిల్‌‌గేట్స్‌‌ ఫౌండేషన్‌‌ నుంచి గ్రాంట్‌‌ వచ్చింది
2006: కుక్క కరవడం వల్ల వచ్చే రాబిస్‌‌ వ్యాధికి వ్యాక్సిన్‌‌ డెవెలప్‌‌ చేసింది
2007: హెమోఫిలిస్ ఇన్‌‌ఫ్లూయెంజా టైప్‌‌ బీ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది
2009: పెంటావాలెంట్‌‌ కాంబినేషన్‌‌ వ్యాక్సిన్‌‌ను గ్లోబల్‌‌గా లాంచ్‌‌ చేసింది
2010: స్వైన్‌‌ఫ్లూ వ్యాక్సిన్‌‌ తయారు చేసినట్టు ప్రకటించింది
2013: టైఫాయిడ్‌‌ను తగ్గించే వ్యాక్సిన్‌‌ డెవెలప్‌‌ చేసింది
2014: జపనీస్‌‌ ఎన్సెఫలిటీస్‌‌ వ్యాక్సిన్‌‌ను తీసుకొచ్చింది
2015: రోటా వైరస్‌‌ వ్యాక్సిన్‌‌ తెచ్చారు. ఇది శిశు మరణాలను అడ్డుకుంటుంది.
2016: జికా వైరస్ వ్యాక్సిన్‌‌కు పేటెంట్‌‌ కోసం దరఖాస్తు చేసింది
2018: టైఫాయిడ్‌‌, రోటావైరస్‌‌ వ్యాక్సిన్లకు డబ్ల్యూహెచ్‌‌ఓ అనుమతుల కోసం ప్రిక్వాలిఫికేషన్‌‌ సంపాదించింది
2019: చిరాన్‌‌ బెరింగ్‌‌ వ్యాక్సిన్‌‌ కంపెనీని కొన్నది
2020: కరోనా వైరస్‌‌ వ్యాక్సిన్‌‌పై రీసెర్చ్‌‌ మొదలుపెట్టింది
2021: ఈ వ్యాక్సిన్‌‌ ఎమర్జెన్సీ వాడకానికి గవర్నమెంటు పర్మిషన్లు ఇచ్చింది