రేపటి నుంచి వొడాఫోన్ ఐడియా, ఎయిర్​టెల్​ ఛార్జీల మోత

న్యూఢిల్లీ :  వొడాఫోన్ ఐడియా తన మొబైల్ కాల్స్,  డేటా ఛార్జీలను రేపటి(మంగళవారం)  నుంచి పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. 2 రోజుల, 28 రోజుల, 84 రోజుల, 365 రోజుల వాలిడిటీతో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌‌‌‌పెయిడ్‌‌‌‌ సర్వీసుల కొత్త ప్లాన్స్‌‌‌‌ను కూడా వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. కొత్త ప్లాన్స్, పాత ప్లాన్ల రేట్ల కంటే 42 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. ‘ దేశంలో లీడింగ్ టెలికాం సర్వీసు ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్) ప్రీపెయిడ్ ప్రొడక్ట్‌‌‌‌ల, సర్వీసుల కొత్త టారిఫ్స్, ప్లాన్లను ప్రకటించింది. కొత్త ప్లాన్లు దేశవ్యాప్తంగా 2019 డిసెంబర్ 3(మంగళవారం) నుంచి అందుబాటులో ఉంటాయి’ అని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ కూడా మంగళవారం  నుంచే తన కాల్, డేటా ఛార్జీలను రివైజ్ చేయనుంది. వొడాఫోన్ ఐడియా ప్రకటన తర్వాత తాను కూడా ప్రీపెయిడ్ కస్టమర్ల డేటా, కాల్ ఛార్జీలను ఈ నెల 3 నుంచి పెంచనున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ కొత్త ప్లాన్స్ కాస్ట్ కూడా అన్‌‌‌‌లిమిటెడ్ కేటగిరీలో పాత ప్లాన్స్ కంటే 42 శాతం వరకు అధికంగా ఉన్నాయి.ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ కొత్త ప్లాన్ల టారిఫ్‌‌‌‌లు రోజుకు 50 పైసల నుంచి రూ.2.85 మధ్యలో పెరిగాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ థ్యాంక్స్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో భాగంగా ఎక్స్‌‌‌‌క్లూజివ్ ప్రయోజనాలను అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

జియో ఈ నెల 6 నుంచి పెంపు

రిలయన్స్ జియో కూడా ఈ నెల 6 నుంచి అన్‌‌లిమిటెడ్‌‌ వాయిస్, డేటాతో కొత్త ఆల్‌‌–ఇన్‌‌–వన్‌‌ ప్లాన్స్‌‌ను లాంచ్ చేస్తున్నది. దీనిలో భాగంగా తన వాయిస్, డేటా ఛార్జీలు 40 శాతం వరకు పెరగనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త ప్లాన్స్ కింద 300 శాతం వరకు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది.

Latest Updates