బెల్ట్ షాపులు మూసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్

హైద‌రాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బెల్ట్ షాపులను మూసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న‌ద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ భారీ ఆందోళనలకు సిద్ధం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం జ‌రిగిన సీఎల్పీ సమావేశంలో తెలంగాణ లోని చాలా ప్రాజెక్టు లకు ప్రమాదకరంగా మారిన జివో నెంబర్ 203కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లాల‌ని తీర్మానం చేశామ‌న్నారు. కాంగ్రెస్ డెలిగేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి నది జలాల సమస్యలపై వివరిస్తామని చెప్పారు.

కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్ట‌ర్స్ లో హోమ్ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకోవాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లుల నియంత్రణ పై ప్రభుత్వం సీరియస్ గా ఉండాలని, రిజ‌ల్యూషన్ పాస్ చేయాలని సీఎల్పీ డిమాండ్ చేస్తున్న‌ట్టు చెప్పారు.

త్వరలోనే జిల్లా ఆసుపత్రులను విజిట్ చేయాలని నిర్ణయించామని, కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల సహయార్థం గాంధీ భవన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని బావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అనేక దాడులపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి , రాష్ట్రపతి ని కలుస్తామని అన్నారు భ‌ట్టి. పార్టీ ఫిరాయింపులతో పాటు, పార్టీ కార్యాలయలను ఆక్రమించుకొనే టీఆర్ఎస్ సంస్కృతి కి వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నామని చెప్పారు.

Latest Updates