
ముంబై: భీమా కోరేగావ్ కేసు విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి బదిలీ చేశారు. కేంద్ర హోంశాఖ ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించింది. కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు తప్పుపట్టాయి. తమ తప్పులు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శనివారం ముంబైలో ఆరోపించారు. భీమా కోరేగావ్ కేసులో మరోసారి దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. “ఈ కేసులో తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చారు. అవి తీవ్రమైన ఆరోపణలు. అందుకే మళ్లీ దర్యాప్తు జరిపించాలని సీఎం ఉద్ధవ్ థాక్రేను కోరుతున్నా” అని శరద్ పవార్ అన్నారు. ఎల్గర్ పరిషత్ కేసులో సామాజిక కార్యకర్తలపై పుణె పోలీసులు తీసుకున్న చర్యపై రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని గతనెల శరద్ పవార్ డిమాండ్ చేశారు.
బీజేపీని వ్యతిరేకిస్తే అర్బన్ నక్సల్సా: రాహుల్
బీజేపీ ఎజెండాను వ్యతిరేకించేవారిని అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేశారు. ఈ కేసుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ సీనియర్ పోలీసు ఆఫీసర్లతో రివ్యూ చేసిన మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించింది. దీన్ని మహారాష్ట్ర సర్కారు తప్పుబట్టింది. రెండేళ్ల తర్వాత ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంలో బీజేపీ కుట్ర దాగి ఉందని, కేంద్రం తీరును ఖండిస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సచిన్ సావంత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో గత సర్కారు చేసిన తప్పులను కవర్ చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్సీపీ స్పోక్స్ పర్సన్, మైనార్టీ శాఖ మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. 2017 డిసెంబర్ 31న జరిగిన ఎల్గర్ పరిషత్ సభను మావోయిస్టులు సపోర్ట్ చేశారని, రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల మరుసటి రోజు అల్లర్లు జరిగాయని పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. యాక్టివిస్టులు సుధీర్ ధవళే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వేస్, సుధా భరద్వాజ్, వరవరరావులను అరెస్టు చేశారు.