అమ్మాయిలతో దుస్తులు విప్పించిన ప్రిన్సిపాల్ సస్పెన్షన్

గుజరాత్‌ భుజ్‌‌లోని శ్రీ సహజానంద గర్ల్స్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ విద్యార్థినులతో దుస్తులు విప్పించిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నెలసరిలో సమయంలో కిచెన్‌లోకి వెళ్లకూడదన్న ఆ కాలేజీ హాస్టల్ నిబంధనను ఉల్లంఘించారన్న అనుమానంతో వారి లోదుస్తులను తీయించి పీరియడ్స్‌లో ఉన్నారో లేదో చెక్ చేయించింది ప్రిన్పిపాల్ రీటా. గత వారంలో దాదాపు 60 మందికిపైగా అమ్మాయిల్ని ఒక్కొక్కరుగా బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి చేక్ చేశారు హాస్టల్ రెక్టార్ ప్రమీలా బెన్, ప్యూన్ నైనా. ఈ ఘటనపై విద్యార్థినులంతా కాలేజీ క్యాంపస్‌లో నిరసనకు దిగారు. దీంతో వర్సిటీ అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. ప్రిన్సిపాల్, రెక్టార్, ప్యూన్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అలాగే వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఇన్‌స్టిట్యూట్ ట్రస్టీ ప్రవీన్ పిండోరియా సోమవారం తెలిపారు. ఈ ముగ్గురితో పాటు కాలేజీతో సంబంధం లేని మరో మహిళ అనిత వారికి సహకరించిందని, ఆమెపై కూడా కేసు నమోదు చేశామని భుజ్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తుకు మహిళా పోలీసులతో సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కచ్ జిల్లాలోని భుజ్‌‌లోని శ్రీ సహజానంద గర్ల్స్‌‌ ఇనిస్టిట్యూట్‌‌.. స్వామి నారాయణ్​ మందిర్‌‌‌‌ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ కాలేజీలో రూల్స్‌‌ చాలా కఠినంగా ఉంటాయి. నెలసరిలో ఉన్న అమ్మాయిలు కాలేజీ హాస్టల్‌‌లోని వంటగదిలోకి వెళ్లకూడదు. అలాగే తోటి విద్యార్థినులతో కలిసి భోజనం కూడా చేయకూడదు. అలాగే క్లాస్ రూమ్‌లోనూ మిగతా విద్యార్థినులకు దూరంగా కూర్చోవాలి. అయితే కొంతమంది డిగ్రీ అమ్మాయిలు నెలసరి టైంలో వంటగదిలోకి వెళ్లారని ప్రిన్సిపల్‌‌కు కంప్లయింట్‌‌ అందింది. దీంతో 68 మంది స్టూడెంట్స్‌‌ను రెస్ట్‌‌రూంకు తీసుకెళ్లి వారితో బలవంతంగా లో దుస్తులు విప్పించి చెక్​ చేయించారు.

మరోవైపు ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కూడా సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆదివారం నాడు హాస్టల్‌కు వెళ్లి కమిషన్ సభ్యులు విద్యార్థినులతో మాట్లాడారు. ఫిబ్రవరి 11న బలవంతంగా తమను దుస్తులు విప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates