గాంధీ ఆస్పత్రిలో కరెంటు కట్ చేసి.. చీకట్లో వెనుకగేటు నుండి తరలింపు..

సినీ ఫక్కీలో భూమా అఖిలప్రియ తరలింపు.. జడ్జి ముందు హాజరు

హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు.. వైద్య పరీక్షలకు తరలింపు.. ఆస్పత్రి నుండి జడ్జి ముందు హాజరుపరిచే విషయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమెను అరెస్టు చేయక ముందు నుండి పోలీసుల వెనుక మీడియా నీడలా వెంటాడుతుండడంతో పోలీసులు మీడియా కళ్లు కప్పేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నామని చెప్పి రూటు మార్చి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ భూమా అఖిలప్రియకు వైద్య పరీక్షలు చేయించగా.. ఎలాంటి అనారోగ్య  సమస్యలు లేవని వైద్యులు ధృవీకరించారు. ఈలోగా మీడియా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున గాంధీ ఆస్పత్రికి చేరుకోవడంతో అందరి కళ్లు కప్పేందుకు పోలీసులు కరెంట్ కట్ చేయించారు. గాంధీ ఆస్పత్రిలో 20 నిమిషాలపాటు కరెంట్ కట్ చేయించి వెనుక గేటు నుండి తరలించారు. మరో వైపు కరెంటు కట్ తో ఆస్పత్రిలోని రోగులు అవస్థలు పడ్డారు.  జనరేటర్ ఉన్నా ఎందుకు వేయడం లేదంటూ వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గాంధీ ఆస్పత్రి వెనుకగేటు నుంచి చీకట్లో భూమా అఖిలప్రియను తీసుకెళ్లిన పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరుచగా ఆయన ఈనెల 20 వరకు రిమాండ్ కు ఆదేశించారు. పోలీసులు అక్కడి నుండి ఆమెను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించకుండా బేగంపేట మహిళా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. రాత్రంతా ఆమెను మహిళా పీఎస్ లోనే ఉంచి.. ఉదయం చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Updates