పోలీసుల ప్రశ్నలు.. కొన్ని గుర్తు లేవంటూ దాటవేసిన అఖిల ప్రియ

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా కుటుంబ సభ్యుల పాత్ర దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల అదుపులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఉన్నట్లు చెబుతున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ ప్రణాళిక అమలు చేయడానికి ముందు కిడ్నాపర్లతో జగత్ మాట్లాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అఖిలప్రియ అరెస్ట్ సమయంలోనే జగత్ విఖ్యాత్ రెడ్డిని విచారించిన పోలీసులు.. అతని నుంచి వివరాలు సేకరించి వదిలేశారు. జగత్ విఖ్యాత్ డ్రైవర్ చెప్పిన ఆధారాలతో మరోసారి అతన్ని విచారించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే భూమా అఖిలప్రియ రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. కిడ్నాప్ ఉద్దేశంపైనే విచారించిన పోలీసులు.. సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను అఖిల ప్రియ ముందు ఉంచారు. దర్యాప్తు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిన అఖిల ప్రియ..మరికొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదంటూ దాటవేసింది. దీంతో రేపటి అఖిల ప్రియ దర్యాప్తు కీలకంగా మారనుంది.

Latest Updates