మంగమ్మా.. ఏందమ్మా మీ సమస్య? కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకొని..

పింఛన్‌ వస్తలేదు సారూ..ఇప్పియ్యిరి

ఏదైనా కష్టం చెప్పుకుందామని కలెక్టరేట్‌కు వెళ్తే సంబంధిత అధికారి సమయానికి దొరుకుడు కష్టమే. తీరా దొరికినా .. వివరాలు తీసుకొమ్మని ఏ పీఏకో చెప్పి తమ పనుల్లో మునిగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఒక సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగిన బాధితులూ ఉన్నారు. వాళ్ల మాదిరిగానే కింద ఫొటోలో కనిపిస్తున్న అజ్మీరా మంగమ్మ అనే అవ్వకూడా పింఛన్ కోసం రెండేళ్లుగా తిరుగుతోంది. ఈమె ఊరు భూపాలపల్లి మండలం గుర్రంపేట. 70 ఏండ్ల వయస్సులోనూ రికాం లేకుండా ఆఫీసర్లను కలిసి పోతోంది. అయినా పని కావడం లేదు. రెండేళ్ల నుంచి ఇవే తిప్పలు. విసిగిపోయిన మంగమ్మ బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వచ్చింది. కానీ పట్టణ ప్రగతి ఉండడంతో కలెక్టర్‌ మహమ్మద్‌‌ అబ్దుల్‌‌ అజీం అక్కడికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంగమ్మ.. కలెక్టర్‌ వచ్చినంక కలిసేపోతానని ఆఫీస్‌ బయట మెట్లమీద కూర్చుంది. ఇంతలో ఆఫీస్‌కు వచ్చిన కలెక్టర్ కారు దిగుతూనే మంగమ్మను చూసి దగ్గరకొచ్చారు. మెట్లమీద ఆమె పక్కనే కూర్చుని.. నేనే కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకుని సమస్య తెలుసుకున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్‌లో మాట్లాడి పింఛన్ మంజూరు చేయించారు. దీంతో మంగమ్మ ‘నవ్వు సల్లంగుండాలి బాబూ’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఓపిగ్గా వృద్ధురాలి సమస్య విని పరిష్కరించిన కలెక్టర్‌ను అక్కడున్న వారంతా అభినందించారు.

Latest Updates