
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపాలిటీ 22 వ వార్డు నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కౌన్సిలర్ బొర్ర రాకేష్ గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను ఈ రాజీనామా చేశానంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. ఆరోగ్యం సహకరించని కారణంగా ఈ నెల 27న ప్రమాణ స్వీకారం హాజరు కాలేకపోయానని, తన రాజీనామా విషయంలో ఎవరి ప్రోద్భలం లేదని, ఇష్ట పూర్వకంగా, స్వచ్చంధంగా రాజీనామా చేస్తున్నానని, భువనగిరి మున్సిపాలిటీ కి లేఖ రాశాడు.
అయితే అధికార టీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా సహకరించేందుకే రాకేష్ చైర్మన్ ఎన్నిక సమయానికి రాలేదని, బీజేపీ తరపున గెలిచి పార్టీకి ద్రోహం చేశారని, వెంటనే రాజీనామా చేయాలని, ఆ పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేయడంతోనే రాకేష్ రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి.