వాడిన వంట నూనె నుంచి బయోడీజిల్‌

వాడిన వంటనూనె నుంచి బయోడీజిల్‌‌ను తయారు చేసే ప్రత్యేక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం శనివారం దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ప్రారంభించింది.  ప్రభుత్వరంగ ఆయిల్‌‌ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ఇండియల్‌‌ ఆయిల్‌‌, భారత్‌‌ పెట్రోలియం హిందుస్థాన్‌‌ పెట్రోలియం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ‘ప్రపంచ బయోడీజిల్‌‌ డే’ను పురస్కరించుకొని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, నేచురల్‌‌ గ్యాస్‌‌ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ లాంఛనంగా ఈ ప్రాజెక్టును ప్రారంబించారు. వాడిన వంటనూనె నుంచి బయోడీజిల్‌‌ను తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ఓఎంసీలు ప్రైవేటు కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను (ఎక్స్‌‌ప్రెషన్‌‌ ఆఫ్‌‌ ఇంట్రెస్ట్‌‌) కోరనున్నాయి. ఇలా తయారు చేసిన బయోడీజిల్‌‌ను తొలి ఏడాది లీటరుకు రూ.51 చొప్పున, రెండో ఏడాది రూ.52.7 చొప్పున, మూడో ఏడాది నుంచి రూ.54.50 చొప్పున అమ్ముతామని ఓఎంసీలు ప్రకటించారు. వాడిన నూనెను బయోడీజిల్‌‌ కంపెనీలకు అందజేయడానికి ఉద్దేశించిన మొబైల్‌‌ అప్లికేషన్‌‌ను, రీపర్పస్‌‌ యూజ్డ్‌‌ కుకింగ్‌‌ ఆయిల్‌‌ (ఆర్‌‌యూసీఓ) స్టికర్‌‌ను కూడా మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. నగరాల్లో వంటనూనెను వృథాగా పారబోయకుండా చేయడానికి ఈ యాప్‌‌ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. వాడిన వంటనూనె (యూసీఓ)ను అందజేసే హోటళ్లు, రెస్టారెంట్ల గోడలకు ఈ స్టికర్‌‌ను అంటిస్తారు.

ఇప్పటికే 300 కంపెనీలు రెడీ..

ఈ సందర్భంగా ప్రధాన్‌‌ మాట్లాడుతూ ‘‘యూసీఓతోపాటు చాలా రకాలుగా బయోడీజిల్‌‌ను తయారు చేయవచ్చు. యూసీఓ ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిదికాదు. ప్రపంచ జీవఇంధన దినోత్సవాన్ని మనం ప్రత్యామ్నాయ ఇంధన దినోత్సవంగా జరుపుకుంటాం. ఇళ్లలో మిగిలిన పాలను అముల్‌‌ సేకరించి వాణిజ్య అవసరాలకు వాడుకున్నట్టే..  వాడినవంటనూనెను మేం బయోడీజిల్‌‌ తయారీకి వాడుతాం. అయితే దీనిని పెద్ద మొత్తంలో సరఫరా చేయడం కష్టమే. బయోగ్యాస్‌‌ తయారీ కోసం 300లకు పైగా కంపెనీలు ముందుకు వచ్చాయి. దీని అమలులో మాత్రం సవాళ్లు ఉంటాయి. 2024 నాటికి ఇలాంటివి ఐదు వేల యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఆయన వివరించారు.

8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు..

ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఎనిమిది కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను అందిస్తామని ప్రధాన్‌‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎల్పీజీ, సీఎన్జీ వంటి స్వచ్ఛమైన ఇంధన అందుబాటులోకి రావడం వల్ల ఛాతీ సంబంధిత వ్యాధులబారిన పడే వారి సంఖ్య తగ్గిందన్నారు.

ఏటా 500 కోట్ల బయోడీజిల్‌‌ కావాలి

ప్రస్తుతం మనదేశంలో ప్రతి నెలా 850 కోట్ల లీటర్ల డీజిల్‌‌ ఖర్చవుతోంది. 2030 నాటికి డీజిల్‌‌లో ఐదుశాతం బయోడీజిల్‌‌ను కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఏటా 500 కోట్ల లీటర్ల బయోడీజిల్‌‌ అవసరం. దేశవ్యాప్తంగా ఏటా 2,700 కోట్ల లీటర్ల వంటనూనెను వాడుతుండగా, ఇందులో 140 కోట్ల లీటర్లు యూసీఓగా మారుతుంది. హోటళ్ల నుంచి, రెస్టారెంట్ల నుంచి, క్యాంటీన్ల నుంచి దీనిని తీసుకుంటే, ఏటా 110 కోట్ల లీటర్ల బయోడీజిల్‌‌ తయారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Latest Updates