నగరంలో పెరుగుతున్న నీటి కష్టాలు

Big demand for water tankers in Hyderabad

రోజు రోజుకి పెరుగుతున్న ఎండలకు సిటీలోని బోర్లు ఎండిపోతున్నాయి. జలమండలి తగినంత నీటిని సరఫరా చేయలేకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్స్ ఆశ్రయిస్తున్నారు సిటీజనం. దీంతో సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో నీటి దందా కొనసాగుతోంది. భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్న స్థలాల్లో బోర్లు వేసి ఇష్టానుసారంగా ధర నిర్ణయించి నీటిని అమ్ముకుంటున్నారు దళారులు.

వేసవి వచ్చిందంటే చాలు.. సిటీ జనానికి నీటి కష్టాలు తప్పవు. వీటికి తోడు నీటి ట్యాంకర్ల దందా కూడా కామన్ గా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో సమ్మర్ రాక ముందే బోర్లు ఎండిపోతున్నాయి. మార్చి నుంచి మొదలైన నీటి కష్టాలు మరో మూడు నెలల వరకు కొనసాగుతాయి.

సిటీలో చాలా వరకు బోర్లు ఎండిపోవడంతో వాటర్ ట్యాంకర్స్ పైనే జనం ఆధారపడుతున్నారు. అయితే డిమాండ్ మేరకు జలమండలి ట్యాంకర్స్ సప్లై చేయలేకపోతుంది. సమ్మర్ లో అదనంగా వాటర్ ట్యాంకర్స్ అందుబాటులో ఉన్నా..డిమాండ్ ను చేరుకోలేకపోతోంది. వాటర్ బోర్డ్ పరిధిలో 7 వందలకు పైగా వాటర్ ట్యాంకర్స్ ద్వారా.. 3 మిలియన్ గ్యాలన్ల నీటిని సప్లై చేస్తుంది. అయినా నీటి కష్టాలు తప్పడంలేదు.

నీటి కష్టాలు పెరగడంతో ప్రైవేట్ ట్యాంకర్స్ పై ఆధారపడుతున్నారు జనం. 5 వేల లీటర్ల జలమండలి వాటర్ ట్యాంక్ 5 వందల రూపాయిలు ఉంటే.. దళారులు అదే వ్యాటర్ ట్యాంక్ ను 12 వందలకు అమ్ముతున్నారు. నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో బోర్లు వేసి..భూగర్భ జలాలను దండుకుంటున్నారు.

సిటీ శివారు ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లను కూడా వ్యాపారులు వాడుకుంటున్నారు. పంట బోర్లతో ట్యాంకర్లను నింపి కమర్షియల్ గా వాడుకుంటున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతి సమ్మర్ లో వందల కోట్ల వ్యాపారం నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. బోర్ వేసేందుకు పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు వేసి వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.

మరోవైపు బబుల్ వాటర్ దందా ఏడాది మొత్తం యథేచ్చగా సాగుతోంది. భూగర్భ జలాలు ఉన్న ఏరియాలతో పాటు, ఇళ్లలో బోర్లు వేసి.. వాటిని నామమాత్రంగా శుద్ధి చేసి.. మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్నారు. పర్మిషన్ లేకుండానే ప్లాంట్లు పెడుతూ కనీస ప్రమాణాలు పాటించకుండా నీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వాటర్ ప్లాంట్స్ పై దాడులు చేసి.. సీజ్ చేస్తున్నా.. మళ్లీ మరోచోట వ్యాపారం మొదలు పెడుతున్నారు.

నీటిదందాను అధికారులు అడ్డుకోకపోతే సమ్మర్లో జేబులు ఖాళీ కావడం ఖాయమంటున్నారు సిటీజనం. జీహెచ్ఎంసీ, జలమండలి సరిపడా నీటిని సప్లై చేయకపోగా దళారులపై చర్యలు తీసుకోకపోవడంతో మండిపడుతున్నారు.

Latest Updates