సెర్ప్ లో పెద్ద పోస్టులన్నీ ఖాళీ

ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్న సర్కార్
పాలన గాడి తప్పుతోందంటున్న ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఇన్‌చార్జీల ‌చార్జీ పాలనతోనే నెట్టుకొస్తోంది. సంస్థలో కీలకమైన సీఈవో పోస్టుతోపాటు మూడు కీలకమైన విభాగాల డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సంస్థలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో, నెలవారీ సమీక్షలు నిర్వహించడంలో, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏడాదిగా ఇన్‌చార్జీ సీఈవోనే..
మహిళా పొదుపు సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలు, మార్కెటింగ్ సౌకర్యం, వివిధ స్వయం ఉపాధి పథకాల అమలుతోపాటు సదరం క్యాంపుల నిర్వహణ, ఆసరా పెన్షన్ల పంపిణీలో సెర్ప్ కీలక పాత్ర పోషిస్తోంది. సెర్ప్ పరిధిలో 47 లక్షల మంది సభ్యులతో 4.7 లక్షల డ్వాక్రా సంఘాలు, 18 వేల గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. గ్రామీణ మహిళలతో సుదీర్ఘ అనుంబంధం కలిగిన ఈ సంస్థవారిలో ఆర్థిక అక్షరాస్యతను, సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఈ సంస్థకు సెర్ప్ చీఫ్ ఎగ్క్యూజిటివ్ ఆఫీసర్(సీఈవో)గా పనిచేసిన పౌసుమి బసు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ పోస్టు నుంచి ట్రాన్స్‌ఫర్ కావడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇన్‌చార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆ శాఖ పరిధిలోని వివిధ విభాగాలను సమన్వయం చేయడంలో బిజీగా ఉండే ఆయన సెర్ప్‌పై ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ పోస్టులు ఖాళీ..
సెర్స్‌లో అడ్మిన్, ఫామ్, నాన్ ఫామ్, లైవ్లీ హుడ్స్, ఇనిస్టిట్యూషనల్ బిల్డింగ్, ఆసరా, బ్యాంకు లింకేజీ తదితర విభాగాలకు ఎనిమిది మంది డైరెక్టర్లు పని చేస్తుంటారు. ఇందులో మహిళా సంఘాల బుక్ కీపింగ్, ఆన్‌లైన్‌ లావాదేవీల తనిఖీ, నెలనెలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మహిళా సంఘాలు, మహిళా సమాఖ్య సమావేశాల నిర్వహణను పర్యవేక్షించే ఇనిస్టిట్యూషనల్ బిల్డింగ్(ఐబీ) విభాగం సెర్స్‌లో కీలకమైనది. దీనికి డైరెక్టర్‌ గా పని చేసిన మురళి తన మాతృ శాఖకు వెళ్లిపోవడంతో ఐదు నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఈ విభాగంతో ఏ మాత్రం సంబంధం, అవగాహన లేని వ్యక్తికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారని ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. అలాగే మహిళలకు రుణాలు, మాస్కులు, పచ్చళ్లు, పేపర్ ప్లేట్స్ లాంటి కుటీర పరిశ్రమల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే నాన్ ఫామ్ డైరెక్టర్ పోస్టు కూడా ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. అన్ని విభాగాలను సమన్వయం చేసే అడ్మిన్ డైరెక్టర్ పోస్టులో ఉన్న బాలయ్య టర్మ్ జూన్ 30తో ముగియడంతో నెల రోజులుగా ఆ పోస్టుకూడా ఖాళీగా ఉంది. దీంతో పాలన గాడి తప్పుతోందని సెర్ప్ ఉద్యోగులు అంటున్నారు. పూర్తి స్థాయి సీఈవో, డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

For More News..

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

ప్రముఖ కళాకారుడు వంగపండు మృతి

జాబ్ లేనోళ్లకు ఆసరగా మారిన మాస్క్

Latest Updates