నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ షాక్

బీజేపీలో చేరనున్న ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు

ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కలసిన స్థానిక నేతలు

నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. డిచ్ పల్లి మండలంలో టిఆర్ఎస్ కి చెందిన స్థానిక నేతలు బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారథ్యంలో.. పది మంది డిచ్ పల్లి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఢిల్లీలో కలిశారు. మాజీ జడ్పీటీసీ దినేష్ ఆధ్వర్యంలో మూకుమ్మడిగా పార్టీ మారేందుకు తరలివెళ్లారు. గత ఐదేళ్లుగా అధికార పార్టీ గ్రామాలకు నిధులు కేటాయించడం లేదని,  ప్రజలకు తమ ముఖం చూపించలేక పోతున్నామని,  గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిందని వారు ఆరోపించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా స్వాగతం పలుకుతున్నా-బండి సంజయ్

బీజేపీలో చేరేందుకు సిద్ధమై వచ్చిన వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఆహ్వానిస్తున్నానని బండి సంజయ్ ప్రకటించారు. సీఎ కేసీఆర్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ఎన్నికలుంటేనే సర్పంచ్,ఎంపిపిలు,ఎంపిటిసిలు,జెడ్పీటీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఒక్క పైసా కేసీఆర్ కేటాయించలేదు, రైతు వేదిక,శ్మశాన వాటికలు, ట్రాక్టర్ల డబ్బులు అన్నీ కేంద్రానివే, స్థానిక సంస్థల కోసం కేంద్రం ఇచ్చే నిధులు ఇతర పథకాలకు నిధులు మళ్లించారని బండి సంజయ్ ఆరోపించారు. గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఏమనుకుంటున్నారో కేసీఆర్ నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంపిపిలు, జెడ్పిటీసిలు,ఎంపిటిసిల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. గ్రామాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారైనా సమీక్ష చేసారా..? సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. అందుకే నన్ను నా కుటుంబాన్ని జైలుకు పంపొద్దని కేసీఆర్ కేంద్రం వద్ద పొర్లు దండాలు పెట్టుకుని వేడుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మెత్తబడి ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారు..మేం ఢిల్లీలో ఉన్నా.. ఎక్కడున్నా కేసీఆర్ ను..  కేసీఆర్ కుటుంబాన్ని విడిచిపెట్టేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. కేంద్రానికి భయపడి కేసీఆర్ యూటర్న్ తీసుకుని కేంద్ర పథకాలు అమలు చేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయోమోనని హడావుడిగా కేంద్ర పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, బుద్ధి ,సిగ్గు ఉన్నవారెవరూ టీఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోరని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇది ప్రారంభం మాత్రమే-దినేష్, మాజీ జడ్పీటీసీ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్

రేపు ధర్మపురి అరవింద్ నేతృత్వంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నామని మాజీ జడ్పీటీసీ దినేష్ ప్రకటించారు. ఇది ప్రారంభం మాత్రమే, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ తోనే సాధ్యం అన్నారు. వచ్చే 6 నెలల్లో తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున తెలంగాణను కాపాడుకునే ఉద్యమం చేపట్టబోతున్నామని ప్రకటించారు. స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడంతో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయన్నారు. స్థానిక సంస్థలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు స్థానిక సంస్థల నేతలంతా బీజేపీ లో చేరుతున్నామని మాజీ జడ్పీటీసీ దినేష్ వెల్లడించారు.

Latest Updates