సిమెంట్, స్టీల్ కంపెనీలు ముఠా కట్టి రేట్లు పెంచుతున్నాయ్

  • రేట్లు ఎందుకు పెంచుతున్నాయో తెలియడం లేదు
  • ఇలాగైతే ఇన్ ఫ్రా ప్రాజెక్టులకు కష్టమే
  • కేం ద్ర రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి

న్యూఢిల్లీ: సిమెంట్, స్టీల్ పరిశ్రమలు కార్టెల్ (ముఠా) అవుతున్నాయని, రియల్ ఎస్టేట్ రంగంలోని పరిస్థితులను ఆసరాగా చేసుకుని సిమెంట్, స్టీలు ధరలు పెంచేస్తున్నాయని రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరి విమర్శించారు. సిమెంట్ కంపెనీలు సిట్యుయేషన్ను ఎడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయని, ఇది దేశ ప్రయోజనాలకు అనువైనది కాదని అభిప్రాయపడ్డారు. రాబోయే అయిదేళ్లలో రూ. 111 లక్షల కోట్ల విలువైన ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు చేద్దామనుకుంటోందని, స్టీలు, సిమెంట్ రేట్ల పెరుగుదల ఇలాగే కొనసాగితే చాలా కష్టమవుతుందని ఆయన చెప్పారు. సిమెంట్, స్టీల్ రంగాలలో కార్టెల్ ఉంది. ప్రతి స్టీల్ కంపెనీకి సొంత ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. లేబర్, ఎలక్ట్రిసిటీ కాస్ట్స్ పెరగకపోయినా, తమ ప్రొడక్ట్స్ రేట్లను ఆ రెండు రంగాలలోని కంపెనీలు పెంచేస్తున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. రేట్ల పెంపుదల వెనక ఉన్న కారణమేమిటో అర్థం కావడంలేదన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వెస్టర్న్ రీజియన్) మెంబర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఇంటరాక్షన్లో నితిన్ గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు. సిమెంట్, స్టీల్ పరిశ్రమల కోసం ఒక రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ కోరగా, ఈ ప్రపోజల్ను ప్రైమ్ మినిస్టర్కు, ఫైనాన్స్ మినిస్టర్కు పంపిస్తానని గడ్కరి వారికి హామీ ఇచ్చారు. దేశంలోని పెద్ద సిమెంట్ కంపెనీలపై కిందటి నెలలోనే కాంపనిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. కాంపిటీషన్ చట్టాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామని ఆ సందర్భంగా ఏసీసీ, గుజరాత్ అంబుజాలు ప్రకటించాయి.

Latest Updates