బిగ్ బాస్ 3 ఎందుకు స్పెషల్ అంటే..!

తెలుగులో సూపర్‌‌‌‌హిట్‌‌‌‌ అయిన రియాలిటీ షోస్‌‌‌‌లో ‘బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌’ ఒకటి. ఇప్పుడు ‘సీజన్‌‌‌‌ 3’ నడుస్తున్నది.

కొంతమందిని ఒక పెద్ద ఇంట్లో పడేసి వాళ్ల మధ్య గేమ్‌‌‌‌ పెట్టి చివరివరకు నిలబడే వాళ్లకు ‘బిగ్​బాస్​’ టైటిల్‌‌‌‌ ఇస్తారు. ప్రపంచమంతటా పాపులర్‌‌‌‌ అయిన కాన్సెప్ట్‌‌‌‌ ఇది.

ఒకే దగ్గరుంటరు కాబట్టి కలిసి వండుకోవాలి, కలిసి తినాలి. ఏ పని చేసినా కలిసి చేయాలి.

మనుషులు అన్నంక ఒక దగ్గరుంటే ఏదో ఒక విషయంల గొడవలు అయితుంటయి. ఇంక గేమ్‌‌‌‌ షో కాబట్టి, ఏవేవో గేమ్స్‌‌‌‌ పెడుతుంటరు. గొడవలకు ఎక్కువ చాన్సులుంటయి. ‘బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌ 3’ నడుస్తున్న ఈ టైమ్‌‌‌‌ల హౌజ్‌‌‌‌లో మస్తు గొడవలయితున్నయి.

ఆ గొడవలు ఆ ఇంటివరకైతే గేమ్‌‌‌‌ కావొచ్చు. కానీ,
ఆ గొడవలు సమాజంలోని కొన్ని ఆలోచనలను చెప్తున్నయి. ఏంటి అవి? ఎందుకు ఈ గొడవలు?

‘బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌’ అన్నది గేమ్‌‌‌‌ షోస్‌‌‌‌లోనే విచిత్రమైనది. బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌ హౌజ్‌‌‌‌లో న్యూస్‌‌‌‌ పేపర్‌‌‌‌ ఉండదు. టీవీ ఉండదు. ఫోన్లు వాడొద్దు. బయట సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. ఎంత సేపు మాట్లాడినా, ఏం మాట్లాడినా హౌజ్‌‌‌‌లో ఉన్నవాళ్లతోనే మాట్లాడాలి. ‘బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌ 3’ రాబట్టి ఇప్పటికే నాలుగు వారాలు అయింది. వారం వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్‌‌‌‌ చేస్తూ ఉంటారు. కాబట్టి, ఎప్పటికప్పుడు గేమ్‌‌‌‌లో బెస్ట్‌‌‌‌ అనిపించుకుంటేనే చివరివరకు నిలబడి టైటిల్‌‌‌‌ కొట్టొచ్చు. ఈ సారి ఈ గేమ్‌‌‌‌ను తెలుగు సినిమా స్టార్‌‌‌‌ సీనియర్‌‌‌‌ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌‌‌‌ చేస్తున్నాడు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు హౌజ్‌‌‌‌లో ఏమేం జరుగుతోంది? ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది చూసి శని, ఆదివారాలు నాగార్జున వాళ్లతో మాట్లాడతాడు. ఎవరైనా తప్పులు చేస్తే తిడతాడు. మంచి పని చేస్తే మెచ్చుకుంటాడు. అలా పోయిన శనివారం నాగార్జున.. ఒక కంటెస్టెంట్‌‌‌‌ అలీ రెజాని గట్టిగా తిట్టాడు. ఆ తర్వాత రాహుల్‌‌‌‌ను కూడా అలాగే తిట్టాడు. తమన్నాని కూడా సీరియస్‌‌‌‌గా
మందలించాడు. ఒక్కొక్కరిదీ ఒక్కో తప్పు. ఆ తప్పు చేసిన ముగ్గురితోనూ సారీ  చెప్పించాడు నాగార్జున.

ఇది పెద్ద తప్పే…

అలీ చేసిన తప్పు గురించి ముందు చెప్పుకోవాలి. అలీ సినిమాల్లో, టీవీల్లో చేస్తున్న యాక్టర్‌‌‌‌. ఈసారి ‘బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌ 3’లో మంచి క్రేజ్‌‌‌‌ ఉన్న కంటెస్టెంట్‌‌‌‌. ఊళ్లో దొంగలు పడకుండా చూసే ఒక టాస్క్‌‌‌‌లో అలీది గ్రామస్తుడి పాత్ర. ఊరికి బయటినుంచి కొత్తవాళ్లు ఎవరొచ్చినా గమనిస్తుంటాడు. బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌లో ఒక కంటెస్టెంట్‌‌‌‌ హిమజ ఆ ఊరికొచ్చే గెస్ట్‌‌‌‌. ఆమె తనకు నీళ్లు కావాల్సినప్పుడు డబ్బులిచ్చి కొనుక్కోవాలి.

ఈ టాస్క్‌‌‌‌లో మామూలుగానే నీళ్ల కోసం వెళ్లింది హిమజ. అలీ ఆమెను డబ్బులిచ్చే నీళ్లు తీసుకోవాలని అడిగాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని ఆ నీళ్లను లాక్కొని వెళ్లింది. ఆ గొడవలో అలీ హిమజ ప్యాంట్‌‌‌‌ జేబులో చెయ్యి పెట్టి డబ్బులు లాక్కోబోయాడు. అలీ నుంచి తప్పించుకోబోయే తోపులాటలో హిమజ కాలు అలీకి తగిలింది. అక్కడ గొడవ మొదలైంది. ‘ఎలా తంతావు’ అని అలీ, ‘నా జేబులో ఎలా చెయ్యి పెడతావు?’ అని హిమజ గొడవ పడ్డారు.

సోషల్‌‌‌‌ మీడియాలో ఈ విషయం మీద పెద్ద డిస్కషనే జరిగింది. ఎక్కువమంది హిమజకి సపోర్ట్‌‌‌‌గా ఉంటే, కొంతమంది అలీని కూడా సమర్థించారు. ‘ప్యాంటు జేబులో అనుమతి లేకుండా, బలవంతంగా చెయ్యి పెట్టి డబ్బులు లాక్కోవడం అలీ తప్పు. తను ఆ టైమ్‌‌‌‌కి అతడ్ని తన్నడంలో తప్పేముంది?’ అని హిమజని సపోర్ట్‌‌‌‌ చేసినవాళ్లు అన్నారు.

‘అది గేమ్‌‌‌‌. గేమ్‌‌‌‌లో తన పని తాను చేశాడు అలీ. హిమజ సరిగ్గా గేమ్‌‌‌‌ ఆడలేదు’ అని అలీ సపోర్టర్స్‌‌‌‌ ఆర్గ్యూ చేశారు. సోషల్‌‌‌‌ మీడియాలో ఈ గోల జరుగుతూనే వచ్చింది. శనివారం రోజు నాగార్జున దీని గురించి ఏమంటాడో చూడాలని బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ ఎదురుచూశారు. అనుకున్నట్టే నాగార్జున ఈ ఇష్యూని చాలా సీరియస్‌‌‌‌గా తీసుకున్నాడు.

‘అలీ, నువ్వు చేసింది తప్పు. నీకిచ్చిన టాస్క్‌‌‌‌ పూర్తి చేయడానికి హిమజని అడగొచ్చు. వేరే హౌజ్‌‌‌‌మేట్స్‌‌‌‌ సాయం తీసుకోవచ్చు. కానీ, నువ్వు హిమజ ప్యాంట్‌‌‌‌ జేబులో చెయ్యి పెట్టి డబ్బులు ఎలా తీసుకుంటావు? ఆ అమ్మాయి తన్నడంలో నాకు తప్పు కనిపించలేదు. అది డిఫెన్స్‌‌‌‌. మనం ఈ హౌజ్‌‌‌‌లో ఒకరికి ఒకరం రెస్పెక్ట్‌‌‌‌ ఇచ్చుకోవాలి’ అంటూ అలీని గట్టిగా తిట్టాడు. ఆ తర్వాత అలీతో హిమజకు సారీ చెప్పించే వరకూ నాగార్జున అరిచినట్టే మాట్లాడాడు. గుంజీలు కూడా తీయించాడు.

రెస్పెక్ట్​ ప్రొఫెషన్​

ఇదే హౌజ్‌‌‌‌లో శనివారం రోజే సింగర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ను, ట్రాన్స్‌‌‌‌జెండర్‌‌‌‌ కంటెస్టెంట్‌‌‌‌ తమన్నా సింహాద్రిని నాగార్జున తిట్టాడు. వీళ్లను తిట్టడానికి కారణం.. ఇతరుల ప్రొఫెషన్స్‌‌‌‌ని తక్కువ చేసి మాట్లాడటం. ‘జర్నలిజం ఒక యాక్టింగ్‌‌‌‌. డబ్బులు తీసుకుని చేసే యాక్టింగ్‌‌‌‌’ అని జర్నలిజం ప్రొఫెషన్‌‌‌‌ గురించి హౌజ్‌‌‌‌లో ఒక సందర్భంలో కంటెస్టెంట్‌‌‌‌ శివజ్యోతిని ఉద్దేశించి మాట్లాడింది తమన్నా. అలాగే ‘యాంకర్‌‌‌‌వి యాంకర్‌‌‌‌లా ఉండు’ అంటూ రాహుల్‌‌‌‌.. బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌ మరో కంటెస్టెంట్‌‌‌‌ యాంకర్‌‌‌‌ శ్రీముఖిని ఉద్దేశించి అన్నాడు.ఈ రెండింటినీ కోట్‌‌‌‌ చేశాడు నాగార్జున. ప్రొఫెషన్స్‌‌‌‌ని ఎలా తక్కువ చేసి చూస్తారంటూ గట్టిగా మందలించాడు. శ్రీముఖికి రాహుల్‌‌‌‌, శివ జ్యోతికి తమన్నా సారీ చెప్పేవరకూ నాగార్జున ఊరుకోలేదు. పోయిన వారమే బిగ్​బాస్​ హౌస్​నుంచి తమన్నా సింహాద్రి ఎలిమినేట్​ అయింది

నాగార్జున చేసిందే కరెక్ట్‌‌‌‌

బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌ హోస్ట్‌‌‌‌ హౌజ్‌‌‌‌లో జరిగేవన్నీ చూస్తాడు. టీవీల్లో వచ్చేది మాత్రమే కాకుండా, ఏ ఏ రోజు హౌజ్‌‌‌‌లో ఏమేం జరుగుతుందో కూడా చూస్తాడు. ప్రస్తుతం హోస్ట్‌‌‌‌గా ఉన్న నాగార్జున తమన్నా, రాహుల్‌‌‌‌, అలీ విషయంలో జరిగిన గొడవలను సరిగ్గా డీల్‌‌‌‌ చేశాడు. ఎవరి వైపో టర్న్‌‌‌‌ తీసుకోకుండా సమాజం దీన్ని ఎలా చూస్తుందో అలా చూసి మాట్లాడాడు.

అలీని హిమజ తన్నడం గురించి మాట్లాడిన ప్పుడు.. ఏ స్త్రీ అయినా తనపై దాడి జరుగు తుందన్నప్పుడు తనను తాను కాపాడుకునే ప్రయత్నం చెయ్యడం ఒక అవసరమని అన్నాడు. అలాగే చుట్టూ ఉండేవాళ్లు కూడా ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల వైపు నిలబడాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు. రాహుల్‌‌‌‌, తమన్నా వల్ల జరిగిన గొడవల విషయంలో కూడా ‘ఎవ్వరూ ఏ ప్రొఫెషన్​ని తక్కువ చేసి చూడొద్దు’ అని గట్టిగా చెప్పాడు. ఇది బిగ్‌‌‌‌ బాస్‌‌‌‌ హోస్ట్‌‌‌‌గా ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేదే.

‘బిగ్‌‌ బాస్‌‌ 3’
ఎందుకు స్పెషలంటే…

‘బిగ్‌‌ బాస్‌‌ 3’ ని నాలుగు వారాలుగా ఫాలో అవుతున్న వాళ్లకు ఇందులో రోజూ జరిగే విషయాలన్నీ తెలుస్తుంటాయి. వాళ్లు దాన్ని ఎంజాయ్‌‌ చేస్తున్నారు. అయితే, అసలు ‘బిగ్‌‌ బాస్‌‌’ ప్రోగ్రామ్‌‌ ఒక్క ఎపిసోడ్‌‌ కూడా చూడని వాళ్లకు కూడా ఇందులో కొన్ని విషయాలు స్పెషల్‌‌గా కనిపించి ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది తమన్నా సింహాద్రిని ఒక కంటెస్టెంట్‌‌గా తీసుకోవడం. తమన్నా ట్రాన్స్‌‌జెండర్‌‌. ట్రాన్స్‌‌జెండర్‌‌ అనగానే సినిమాల దగ్గర్నుంచి మొదలుపెడితే ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ ఇండస్ట్రీ వరకు.. అన్నిచోట్లా తక్కువగా చేసి చూపిస్తుంటారు. కానీ ఇక్కడ బిగ్‌‌ బాస్‌‌లో తమన్నాకు చోటిచ్చి బిగ్‌‌ మాస్‌‌ స్పెషల్‌‌ అనిపించుకుంది.

మామూలుగా బిగ్‌‌ బాస్‌‌ లాంటి గేమ్‌‌ షోస్‌‌ నుంచి ఎంటర్‌‌టైన్‌‌ మెంట్‌‌ తప్ప సమాజానికి పనికొచ్చేంత గొప్ప విషయాలను ఊహించలేం, కోరుకోలేం కూడా. ‘బిగ్‌‌ బాస్‌‌ 3’లో ఒక మహిళ ప్యాంటు జేబులో ఆమె అనుమతి లేకుండా ఒక వ్యక్తి చెయ్యి పెడితే, హోస్ట్‌‌ నాగార్జున అతడ్ని గట్టిగా తిట్టాడు. గుంజీలు కూడా తీయించాడు. సమాజంలో ఆడవాళ్లు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఎదిరించాలో చెప్పాడు. సమాజంలో నిరంతరం కనిపిస్తుండే ఉమన్‌‌ ఇష్యూస్‌‌ని బిగ్‌‌ బాస్‌‌ లాంటి ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ షోలో నాగార్జున లాంటి స్టార్‌‌ హీరో చర్చకు పెట్టడం మంచి విషయమే.

‘ఆ వాడి జాబా? ఏముంది దాంట్లో?’ అంటూ ఒకరి జాబ్‌‌ గురించి కామెంట్‌‌ చేసేవాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు మన చుట్టూ. వాళ్లకు సమాధానంగా బిగ్‌‌ బాస్‌‌లో ప్రొఫెషనల్‌‌ రెస్పెక్ట్‌‌ గురించి చెప్పాడు నాగార్జున.
ఇతరుల ప్రొఫెషన్‌‌ గురించి
తప్పుగా మాట్లాడినవాళ్లను తిట్టాడు. అందరి పనులను
గౌరవించాలన్న విషయాన్ని బిగ్‌‌ బాస్‌‌లో చర్చకు పెట్టడం అభినందించాల్సిన విషయమే.

Latest Updates