త్వరలో ఇండస్ట్రీలకు కేంద్రం భారీ ప్యాకేజీ

న్యూఢిల్లీ: లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల్లో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం త్వరలో మరో భారీ ప్యాకేజీ ప్రకటించనుంది. డిమాండ్, సప్లయ్ కు సంబంధించి దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ లో పేదలను ఆదుకునేందుకు ఇదివరకే ప్రకటించిన 1 లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీతో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువ మొత్తంలో ఉంటుందని సమాచారం. కొత్త ప్యాకేజీలో భారీ, చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రధానంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. క్యాపిటల్ మార్కెట్ ను బలోపేతం చేయడంతోపాటు ట్రావెల్, ఏవియేషన్ రంగాలకు రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఎల్టీసీజీ వెనక్కి తీసుకోవడం, బైబ్యాక్ ట్యాక్స్ తొలగింపు, కార్పొరేట్ ట్యాక్స్ చెల్లింపు వాయిదా, లోన్ రీపేమెంట్ కు గడువు పెంపు ఇతర వెసులుబాట్లు కల్పిస్తారని సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరుపుతోందని త్వరలో ప్రకటన చేస్తుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

గతంలోనే చెప్పిన నిర్మలా సీతారామన్

‘పేదలకు ఆహారం, డబ్బులు అందించడమే మా ఫస్ట్ ప్రయారిటీ. ఇతర విషయాలు తర్వాత చూస్తాం’ అని 1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పరిశ్రమలను ఆదుకునేందుకు మరో ప్యాకేజీతో వస్తామని అప్పట్లోనే ప్రకటించారు.

Latest Updates