
లాక్‌డౌన్‌తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.ఈ సమయంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన ఓ లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) అమిత్ కుమార్ జిల్లా ఎస్పీలకు మూడు రోజుల క్రితం ఓ లేఖ రాశారు. కరోనా కారణంగా ఉపాధి లేక బీహార్ కు తిరిగివచ్చిన వలస కూలీలు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆ లేఖలో తెలిపారు. కూలీల రాకతో రాష్ట్రంలో మరోసారి నేరాలు పెరిగే అవకాశం ఉందని ఏడీజీ వివాదాస్పద రీతిలో లేఖ రాశారు. అంతేకాకుండా అనుమానాస్పద రీతిలో సంచరిస్తున్న కూలీల వివరాలను నమోదు చేసుకోవాలని స్థానిక ఎస్పీలందరికీ ఆయన సూచించారు.
ఏడీజీ రాసిన లేఖపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో పాటు మరికొందరు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను దొంగలతో పోల్చడం సరైనది కాదని… సీఎం నితీష్ కుమార్ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాల నుంచి విమర్శలు ఎక్కువతుండటంతో తన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏడీజీ కుమార్ ప్రకటించడంతో వివాదం ముగిసిపోయింది.
