మనసున్న కలెక్టరమ్మ.. అమర జవాన్ల కూతుళ్ల దత్తత

బిహార్ : షేక్ పురా జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఇనాయత్ ఖాన్ మానవత్వం చూపించారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు ఇటీవల పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన మానవబాంబు దాడిలో అమరులయ్యారు. వీరి ఇద్దరు బిడ్డలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరిచేత శెభాష్ అనిపించుకుంటున్నారు.

పుల్వామా ఉగ్రదాడిలో.. పాట్నాకు చెందిన కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సిన్హా, భగల్ పూర్ కు చెందిన రతన్ కుమార్ ఠాకూర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకునేందుకు బిహార్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఇనాయత్ ఖాన్ ముందుకొచ్చారు. ఎస్కే సిన్హా, రతన్ కుమార్ ఠాకూర్ ల పేరుతో జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరిచారు. తన రెండురోజుల జీతాన్ని అందులో ముందుగా డిపాజిట్ చేశారు. ఈ అకౌంట్ డీటెయిల్స్ ను ప్రజలకు తెలిపారు. ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని షేక్ పురా జిల్లా ప్రభుత్వ అధికారులను ఆమె కోరారు. ఈ అకౌంట్ లో డిపాజిట్ అయ్యే డబ్బులను ఆ రెండు కుటుంబాలకు సమంగా పంచుతానని ఆమె చెప్పారు.

ఇద్దరు జవాన్ల కుటుంబాల్లో ఉన్న ఒక్కో ఆడబిడ్డకు సహాయాన్ని అందిస్తానని కలెక్టర్ శనివారం చెప్పారు. అమరులైన జవాన్లు ఎస్కే సిన్హా కూతురు, రతన్ కుమార్ ఠాకూర్ కూతురులను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ ఇద్దరు బిడ్డలకు చదువుతో పాటు అన్ని ఖర్చులు తానే భరిస్తానని చెప్పారు కలెక్టర్ ఇనాయత్ ఖాన్.

Latest Updates