ఊరికోసం 30 సంవత్సరాలు కష్టపడి.. 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు

పంటలకు నీరే ఆధారం. కొన్ని ప్రాంతాలలో బోర్లు ఆధారమైతే.. మరికొన్ని ప్రాంతాలలో వర్షపు నీరే ఆధారం. అలా వర్షపు నీటి మీద ఆధారపడి వ్యవసాయం చేసే ఒక వ్యక్తి.. తమ ఊరికోసం 30 సంవత్సరాలు కష్టపడి.. 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు. బీహార్‌కు చెందిన లాంగి భూయాన్ అనే వ్యక్తి గయాలోని లాహతువా ప్రాంతంలోని కోతిలావా గ్రామంలో నివసిస్తున్నాడు. గ్రామంలో నీటి వసతి లేక.. పంటలు పండక చాలామంది ఊరు వదిలి పట్టణాలకు వెళ్లిపోయారు. ఆయన మాత్రం ఊరి మీద ప్రేమతో అక్కడే ఉండిపోయాడు.

భూయాన్ ప్రతిరోజూ తన పశువులను మేపడానికి అడవికి వెళ్తుండేవాడు. అలా అడవికి వెళ్లినప్పుడు వర్షాల వల్ల వచ్చిన నీరు అంతా కొండల మీది నుంచి నదిలోకి వెళ్లి కలవడం చూశాడు. అది చూసిన భూయాన్.. ఆ నీటిని తన గ్రామానికి మళ్లిస్తే.. పశువులకు నీరు దొరుకుతుంది మరియు పంటలు కూడా పండుతాయని భావించాడు.

అనుకున్నదే తడవుగా భూయాన్.. రోజూ అడవికి వెళ్లి 30 సంవత్సరాలు కష్టపడి 3 కిలోమీటర్ల పొడవైన కాలువను తవ్వాడు. ఈ పనిలో గ్రామస్తులెవరూ ఆయనకు సాయంరాలేదు. ఆ కాలువను తన గ్రామంలోని ఒక చెరువుకు అనుసంధానం చేశాడు. దాంతో కొండల మీద పడిన వర్షపు నీరంతా కాలువ ద్వారా చెరువులోకి చేరుతుంది. ఇప్పుడు తమ గ్రామప్రజలకు నీటి వసతితో చేతి పని దొరుకుతుందని భూయాన్ అంటున్నారు. ఎవరూ ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరంలేదని ఆయన అంటున్నారు. ‘నేను ఒంటరిగా 30 సంవత్సరాలుగా ఈ కాలువను తవ్వాను. గ్రామంలోని వారేవరూ నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పడు అందరూ కాలువను చూసి సంతోషపడుతున్నారు’ అని భూయాన్ అన్నాడు.

For More News..

వీడియో: ముంబై ఇండియన్స్ బౌలర్ ధాటికి రెండు ముక్కలైన మిడ్ వికెట్

Latest Updates