కాలేజీ బస్సు బీభత్సం- పెళ్లి కావాల్సిన జంట మృతి

Bike Accident in KPHB Nijampet

మ‌రికొన్ని రోజుల్లో పెళ్లి పీట‌లెక్కాల్సిన ఓ జంట అర్ధాంత‌రంగా మృత్యుఒడిలోకి వెళ్లారు. బైక్‌పై వెళుతున్న వారిని ఓ క‌ళాశాల బ‌స్సు ఢీకొట్ట‌డంతో.. యువ‌కుడు అక్కడికక్కడే మృతి చెందగా, యువ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్ర‌మాదం కేపీహెచ్‌బీ పీ.ఎస్. ప‌రిధిలోని నిజాంపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. కెపీహెచ్‌బి పీఎస్ ఇన్స్‌పెక్ట‌ర్ లక్ష్మీ నారాయణ క‌థ‌నం మేర‌కు.. నిజాంపేట గ్రామానికి చెందిన అర‌వింద్ అనే యువ‌కుడికి అనంత‌ల‌క్ష్మీ అనే యువ‌తితో కొన్ని రోజుల క్రితం పెండ్లి ఫిక్స్ అయింది.

అయితే పెండ్లికి కొంత స‌మ‌యం ఉండ‌డంతో ఇరువురి కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌లు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈరోజు అనంత‌ల‌క్ష్మీ స‌హ ఆమె కుటుంబ స‌భ్యులు అర‌వింద్ ఇంటికి వ‌చ్చారు. తిరిగి వెళ్లే క్ర‌మంలో వారితో పాటుగా అర‌వింద్ కూడా బ‌య‌ల్దేరాడు. వీరు నిజాంపేట నాగార్జున హోమ్ వ‌ద్దకు రాగానే.. నర్సింహ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన‌ బస్.. ద్విచ‌క్ర వాహానంపై వ‌స్తున్న అర‌వింద్, అనంత‌ల‌క్ష్మీని ఢీకొట్టింది. దీంతో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందగా అనంత లక్ష్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్ట‌ర్ లక్ష్మీ నారాయణ తెలిపారు.

Latest Updates