ప్రపంచ కుబేరుల మొదటి స్థానంలో బిల్ గేట్స్

అమెజాన్​ ఓనర్​ కమ్​ సీఈవో జెఫ్​ బెజోస్​ను మైక్రోసాఫ్ట్​ అధిపతి బిల్​ గేట్స్​ దాటేశారు. మళ్లీ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. శుక్రవారం బ్లూమ్​బర్గ్​ విడుదల చేసిన తాజా ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్​గేట్స్​ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఆయన ఫస్ట్​ ప్లేస్​లోకి వచ్చారు. క్లౌడ్​ కంప్యూటింగ్​ కాంట్రాక్ట్​ను అమెజాన్​కు కాకుండా మైక్రోసాఫ్ట్​కు పెంటగాన్​ అప్పగించడంతో సంస్థ ఆస్తులు పెరిగాయి. 1000 కోట్ల డాలర్ల (సుమారు ₹71,635 కోట్లు) విలువైన ప్రాజెక్ట్​ను దక్కించుకోవడంతో మైక్రోసాఫ్ట్​ ఆస్తులు 11000 కోట్ల డాలర్లకు (సుమారు 7.88 లక్షల కోట్ల రూపాయలు) చేరింది. ప్రాజెక్టు దక్కడంతో కంపెనీ షేర్ల విలువ కూడా 4 శాతం పెరిగింది. అన్నీ కలిసి మైక్రోసాఫ్ట్​ అధిపతికి లక్​ను తీసుకొచ్చాయి. ఇక, వస్తుందనుకున్న కాంట్రాక్ట్​ వేరే కంపెనీకి పోవడంతో అమెజాన్​ షేర్ల విలువ 2 శాతం పడిపోయింది. దీంతో బెజోస్​ ఆస్తి 10,870 కోట్ల డాలర్లకు (సుమారు 7.78 లక్షల కోట్ల రూపాయలు) పడిపోయింది. యూరప్​కు చెందిన కోటీశ్వరుడు బెర్నార్డ్​ ఆర్నాల్ట్​ 10270 కోట్ల డాలర్లతో (సుమారు 7.35 లక్షల కోట్ల రూపాయలు) మూడో స్థానంలో ఉన్నారు.

దెబ్బ కొట్టిన విడాకులు

బెజోస్​ రెండో స్థానానికి పడిపోవడానికి భార్య మెకంజీతో విడాకులూ ప్రభావం చూపించాయి. విడాకుల తర్వాత భరణం కింద ఆమెకు బెజోస్​ 3800 కోట్ల డాలర్లు (సుమారు 2.72 లక్షల కోట్ల రూపాయలు) చెల్లించారు. విడాకులు కాకపోయుంటే, బెజోసే ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఉండేవారు. కాబట్టి విడాకులే ఆయన ర్యాంకుపై దెబ్బ కొట్టిందన్నది నిజమని నిపుణులు అంటున్నారు. ఇక, ఈ జాబితాలో ముఖేశ్​ అంబానీ 14 వ స్థానంలో నిలిచారు. 5670 కోట్ల డాలర్లతో (సుమారు 4.06 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తి ఆయన వద్ద ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 500 మందితో బ్లూమ్​బర్గ్​ ఈ జాబితా విడుదల చేసింది. మొత్తం 17 మంది ఇండియన్లు ఈ జాబితాలో చోటు సంపాదించారు.

 

Latest Updates