మరో వైరస్ కలకలం: కేరళలో బర్డ్ ఫ్లూ

  • హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
  • మనుషులకు సోకకుండా జాగ్రత్త చర్యలు
  • 13 వేల కోళ్లను చంపేయాలని నిర్ణయం

ఓ వైపు కరోనా భయం వణుకు పుట్టిస్తుండగానే.. కేరళలో మరో వైరస్ బయటపడింది. కోజికోడ్ జిల్లా కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్‌ సోకిన్నట్లు తేలింది. జిల్లాలోని వెంగర, కొడియత్తూర్‌లలోని రెండు పౌల్ట్రీ ఫామ్స్‌లో కోళ్లకు వైరస్‌ను గుర్తించినట్లు వెల్లడించారు జంతు సంవర్థక శాఖ అధికారులు. దీంతో దాదాపు ఆ రెండు ఫారాల్లో ఉన్న దాదాపు 13 వేల కోళ్లను చంపేయాలని నిర్ణయించారు. దీనిపై భయపడాల్సిందేమీ లేదని, ప్రస్తుతానికి మనుషులకు వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ రెండు ఫారాల్లోని కోళ్లను చంపేసి, వాటిని మూసేయాలని ఆదేశించినట్లుగా చెప్పారు.

పర్యవేక్షణకు 25 టీమ్స్

వెంగర, కొడియత్తూర్‌లలోని రెండు కోళ్ల ఫారాలలో కొద్ది రోజులుగా భారీగా కోళ్లు మరణిస్తున్నాయి. దీంతో వాటి యజమానులు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం అందించారు. బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందని అనుమానంతో వాటి శాంపిల్స్‌ను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు పంపారు. వైరస్ ఉన్నట్లుగా శనివారం ఉదయం టెస్టు రిజల్ట్స్ వచ్చాయి. దీంతో వెంటనే కోజికోడ్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా వైరస్ మనుషులకు సోకలేదని, వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హై అలర్ట్ ప్రకటించి.. దీనిపై పర్యవేక్షణ కోసం 25 టీమ్‌లను నియమించారు. ఆ కోళ్ల ఫారాలకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ రెండు ఫారాల్లోని 12,900 కోళ్లతో పాటు ఆ పరిసరాల్లోని ఇతర పక్షులను కూడా చంపేయాలని నిర్ణయించామని చెప్పారు.

భయపడాల్సిందేమీ లేదు

బర్డ్ ఫ్లూ గురించి ప్రజలు భయపడాల్సిందేమీ లేదని, వేసవిలో పక్షులకు ఈ వైరస్ రావడం సాధారణమేనని చెప్పారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ. 2016లోనూ ఈ వైరస్ వచ్చిందని, అప్పుడు వేల సంఖ్యలో బాతులు చనిపోయాయని తెలిపారు. వెటర్నరీ, ఆరోగ్య శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు పని చేస్తారని తెలిపారామె.

కాగా, ఇప్పటికే కరోనా వైరస్ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. నాన్ వెజ్ తింటే వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో వదంతుల ప్రచారంతో పౌల్ట్రీ రంగంపై దెబ్బపడింది. కేరళలో ఇప్పుడు బర్డ్ ఫ్లూతో కోళ్ల ఫారాల యజమానులు కోలుకోలేని నష్టాల్లో  కూరుకుపోయే పరిస్థితి నెలకొంది.

Latest Updates