
బర్డ్‌ఫ్లూ క్రమక్రమంగా దేశమంతా విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం బర్డ్‌ఫ్లూ బాధిత రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది. గత రెండు రోజుల వ్యవధిలో మహారాష్ట్ర పర్బని జిల్లా మురంబా గ్రామంలో 800 కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ టెస్టులకు పంపగా.. బర్డ్‌ఫ్లూ వల్లే చనిపోయాయని నిర్ధారణ అయింది. మురుంబా గ్రామంలో 8 కోళ్ల ఫారాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటిలో ఉన్న 8 వేల కోళ్లనూ పూడ్చి పెట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా.. మురంబాకు పది కిలోమీటర్ల పరిధిలో కోళ్ల అమ్మకాలను నిషేధించారు. ఈ నేపథ్యంలో మహరాష్ట్రలో బర్డ్‌ఫ్లూ పరిస్థితిపై సీఎం ఉద్ధవ్ థాక్రే రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు.
ఢిల్లీలో కూడా పక్షుల మరణానికి బర్డ్‌ఫ్లూనే కారణమని తేలింది. దాంతో ఢిల్లీలో కూడా పక్షుల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అంతేకాకుండా.. ఢిల్లీలోనే అతిపెద్దదైన ఘాజిపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బర్డ్‌ఫ్లూ నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలు, ఆదేశాలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆయన తెలిపారు.
కాగా.. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయి. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్రలలో కూడా బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగులోకి రావడంతో.. మొత్తం తొమ్మిది రాష్ట్రాలలో బర్డ్‌ప్లూ నమోదైంది. ఇక ఛత్తీస్ ఘడ్లోని బాలోద్ జిల్లాలోనూ పక్షులు చనిపోయాయి. అయితే చనిపోయిన పక్షులు బర్డ్‌ఫ్లూ వల్లే చనిపోయాయా? లేదా? అని ఇంకా తేలలేదు. చనిపోయిన పక్షుల శాంపిల్స్‌ను టెస్టులకు పంపించారు. వీటి రిజల్ట్స్ ఇంకా రాలేదు.
బర్డ్‌ఫ్లూ వ్యాప్తితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసిన కమిటీ.. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను పరిశీలించాలని సూచించింది.
For More News..