అహ్మదాబాద్ ఎయిర్​పోర్టులో విమానాలకు పక్షుల ముప్పు

కొన్నేండ్ల కిందట.. అమెరికా ఎయిర్​వేస్​కు చెందిన ఓ విమానాన్ని పక్షులు ఢీకొట్టడంతో రెండు ఇంజన్లూ ఫెయిల్​అయ్యాయి. దీంతో ఆ విమానాన్ని ఏకంగా హడ్సన్​ నదిలో దింపాల్సి వచ్చింది. కొన్ని రోజుల కిందట.. రష్యాకు చెందిన ఉరల్​ఎయిర్ ​లైన్స్​ ఏ321 విమానాన్ని కూడా పక్షులు ఢీకొట్టడంతో రెండు ఇంజన్లూ ఫెయిల్​అయ్యాయి. దీంతో ఈ విమానాన్ని మొక్కజొన్న చేల మధ్య ఎమర్జెన్సీ ల్యాండింగ్ ​చేయాల్సి వచ్చింది. పైలట్లు అప్రమత్తంగా ఉండడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అయితే, మన దేశంలోనూ కొన్ని ఎయిర్​పోర్టులలో విమానాలకు పక్షుల నుంచి భారీ ప్రమాదాలే పొంచి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

అహ్మదాబాద్​ ఎయిర్​పోర్టుకు ఎక్కువ ముప్పు

దేశంలో పక్షులు విమానాలను ఢీకొట్టే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఎయిర్​పోర్టుల్లో అహ్మదాబాద్​విమానాశ్రయం మొదటిస్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్య15 సార్లు విమానాలను పక్షులు ఢీకొట్టాయి. జూలై 20న ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని పక్షులు ఢీకొట్టడంతో ఇంజన్లు చెడిపోయి, వెంటనే తిరిగి ఎయిర్​పోర్టులో దింపాల్సి వచ్చింది. పోయిన ఏడాది 85 సార్లు విమానాలను పక్షులు ఢీకొట్టిన సంఘటనలు నమోదు అయ్యాయని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. 2014–15లో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలను పక్షులు ఢీకొట్టిన సంఘటనలు142 సార్లు నమోదయ్యాయి. కోల్​కతాలో 62, ముంబైలో 60, అహ్మదాబాద్​లో 54 సంఘటనలు జరిగాయి. మొత్తం విమాన సర్వీసులు, పక్షులు ఢీకొట్టిన సంఘటనల ప్రకారం చూస్తే ఢిల్లీలో ప్రతి 2 వేల విమానాల్లో ఒకదానిని, ముంబైలో ప్రతి 4500 విమానాల్లో ఒకదానిని, కోల్​కతాలో ప్రతి 1500 విమానాల్లో ఒకదానిని పక్షులు ఢీకొట్టాయి. అయితే, అహ్మదాబాద్​లో  ప్రతి 700 విమానాల్లో ఒక విమానాన్ని పక్షులు ఢీకొట్టాయి. అహ్మదాబాద్​ఎయిర్​పోర్టుకు 30 కిలోమీటర్ల దూరంలోనే థోల్​బర్డ్​ శాంక్చువరీ,  60 కిలోమీటర్ల దూరంలోనూ మరో బర్డ్​శాంక్చువరీ ఉంది. దీంతోపాటు ఇక్కడ ఓపెన్​ల్యాండ్​ఎక్కువగా ఉండి, గడ్డి విపరీతంగా పెరుగుతోంది. అందువల్ల పక్షులు ఇక్కడికి ఆహారం కోసం ఎక్కువగా వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని విమానాశ్రయ సిబ్బంది అంటున్నారు.

పక్షులతో ఎందుకంత డేంజర్?

5 కిలోల బరువున్న పక్షి విమానం ఇంజన్​ను ఢీకొంటే 100 కిలోల వస్తువు ఢీకొన్నంత ఎఫెక్ట్​ఉంటుందట. విమానం పైకి ఎగురుతున్నప్పుడు, కిందికి దిగుతున్నప్పుడు  ఇంజన్​చక్రాలు చాలా వేగంగా తిరుగుతుంటాయి. విమానం ఎత్తు, వేగం, బ్లేడ్ల స్పీడ్, పక్షి ఢీకొనే కోణం ​వంటి అంశాలను బట్టి ఇంజన్ ​బ్లేడ్లు దెబ్బతింటాయి.  ఎక్కువ పక్షులు ఢీకొంటే ఎక్కువ బ్లేడ్లు డ్యామేజ్​అయి ఇంజన్ వెంటనే ఆగిపోతుంది. కొన్నిసార్లు ఒక్క బ్లేడ్​దెబ్బతిన్నా, అది మరో బ్లేడ్​ మీదకు వంగిపోయి మొత్తం ఇంజన్ ఆగిపోతుంది. అందుకే పెను ప్రమాదాలు జరుగుతాయి.

Latest Updates