బిర్యానీ బిల్లు చెల్లింపులో ఘర్షణ : ఒకరు మృతి

ముషీరాబాద్, వెలుగు: బిర్యానీ కోసం మొదలైన తగాదా చివరికి ఒకరి ప్రాణం తీయగా మరో ముగ్గురు జీవితాలను జైలు పాలు చేసిన ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వరంగల్ హన్మకొండ కు చెందిన అభిలాష్ (28 రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఎంబీఏ చదివిన అభిలాష్ ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చి రాంనగర్ లోని అతని స్నేహితుడు వంశీ వద్దకు వచ్చాడు. ఈ నెల 24వ తేదీన అర్ధరాత్రి అక్కడే స్థానికంగా నివసించే హరీష్, చందు అనే మిత్రులతో కలిసి వంశీ, అభిలాష్ మద్యం సేవించారు. అనంతరం అర్ధరాత్రి బిర్యాని తినేందుకు నలుగురు నారాయణగూడ లో ఉన్న ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడ బిల్లు చెల్లించే విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అయితే అక్కడ నుంచి తిరిగి వంశీ ఇంటి వద్దకు చేరుకున్న అనంతరం మళ్ళీ బిర్యాని బిల్లు విషయం పై నలుగురి మధ్య మాట మాట పెరగడంతో ఈ క్రమంలో వంశీ (28) అభిలాష్ ముఖం పై దాడి చేయగా అతడు కింద పడిపోయాడు.అపస్మారక స్థితిలోకి వెళ్లిన అభిలాష్ ను ముగ్గురు స్నేహితులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి 28వ తేదీన నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 29వ తేదీన తెల్లవారు జామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతుడు అభిలాష్ తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 302 సెక్షన్ ప్రకారం హత్య కేసు నమోదు చేశారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు మృతుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. వంశీతో పాటు హరీష్, చందును కూడా పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు.

Latest Updates