
- టెస్లా ప్రొడక్షన్ టయోటా, ఫోక్స్‌వ్యాగన్‌ల కంటే తక్కువ
- బిట్‌కాయిన్‌ను పేమెంట్స్ కోసం వాడుకోలేం: రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ: మార్చి కనిష్టాల నుంచి గ్లోబల్ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లు రికవరీ అవ్వడం చూశాం. ఇదే టైమ్‌లో బిట్‌కాయిన్, టెస్లా అడ్డు అదుపు లేకుండా పెరిగాయి. వీటి ధరకు, వాల్యుయేషన్‌కు మధ్య పొంతన లేకపోయినా ఎందుకలా పెరుగుతున్నాయో ఆర్బీఐ మాజి గవర్నర్ రఘురామ్ రాజన్ వివరించారు. బిట్‌కాయిన్ పెరుగుదల క్లాసిక్ బబుల్(వాస్తవాన్ని పక్కన పెట్టి విపరీతంగా పెరగడం, అంతే వేగంగా పడడం)ను గుర్తుచేస్తోందని అన్నారు. బిట్‌కాయిన్, టెస్లా షేర్లు పెరగడానికి ముఖ్య కారణం చిన్న ఇన్వెస్టర్లు ఎగబడడమే చెప్పారు. ‘స్ట్రాంగ్ రికవరీ ఉంటుందని, భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలంగా మారతాయని ఇన్వెస్టర్లు అంచనావేస్తున్నారు. కానీ, తాత్కాలికంగా ఏర్పడిన వరెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌ను పట్టించుకోవడం లేదు. సమీప కాలంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా అది లాంగ్టెర్మ్పై పెద్దగా ప్రభావం చూపదనే ఆలోచనలతో మార్కెట్ పనిచేస్తోంది. మార్కెట్ పెరగడంలో చిన్న ఇన్వెస్టర్లు కీలకంగా ఉన్నారు. అందుకే బిట్‌కాయిన్, టెస్లా షేరు వంటి అసెట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి’ అని రాజన్ అన్నారు. 2009లో లాంచ్ అయిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ప్రస్తుతం 40 వేల డాలర్లను తాకింది. గత ఏడాది కాలంలో 400 శాతం పెరిగింది. ‘బిట్‌కాయిన్ ఒక క్లాసిక్ బబుల్. ఇది ఎటువంటి వాల్యూని ప్రొడ్యూస్ చేయలేదు. దీన్ని పేమెంట్ల కోసం వాడడం చాలా కష్టం. అయినా ఈ వర్చువల్ కరెన్సీ ధర 40 వేల డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది. ఇంత ఖరీదుగా ఉన్నా ఈ కరెన్సీని ఇన్వెస్టర్లు ఎందుకు కొంటున్నారు? ఎందుకుంటే ఈ కరెన్సీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది అర్థం లేని ఆలోచన’ అని పేర్కొన్నారు.
టెస్లా కంటే బెటర్ కంపెనీలున్నా..
గత ఏడాది కాలంలో టెస్లా షేరు 700 శాతం పెరిగింది. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, జనరల్ మోటార్స్ వంటి పెద్ద కంపెనీల ప్రొడక్షన్‌తో పోల్చుకుంటే టెస్లా ప్రొడక్షన్ చాలా తక్కువ. అయినా ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా ఎదిగింది. ఇన్వెస్టర్లు టయోటా లేదా జనరల్ మోటార్స్ వాల్యుయేషన్ల కంటే టెస్లా వాల్యుని కొన్ని రెట్లు పెంచారని రాజన్ అన్నారు. ఇండియాలోనూ కొన్ని షేర్లను ఇన్వెస్టర్లు ఇలానే పెంచారని పేర్కొన్నారు. ఎంటర్ అయ్యి కొంత లాభం వచ్చాక బయటకొచ్చేద్దామనే ఆలోచనతో వీరు ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఇవే మార్కెట్లను నడుపుతున్నాయని చెప్పారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండోక్వార్టర్ నుంచి మార్కెట్లు రికవరీ అవుతున్నాయి. దీంతో అన్ని రకాల అసెట్ సెగ్మెంట్లు పెరిగాయి. ఇండియన్ మార్కెట్లు కూడా పెరగడానికి ఇదే కారణం’ అని రాజన్ పేర్కొన్నారు. ‘ ఎస్ అండ్ పీ 500 బాగా పెరిగితే ఎమర్జింగ్ మార్కెట్ షేర్లు, హై ఈల్డ్ బాండ్ల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇలానే ప్రతీ అసెట్ సెగ్మెంట్‌ను పెంచారు. బిట్‌కాయిన్ పెరగడానికి ఇదొక కారణం. కేవలం ఇండియానే కాకుండా ప్రతి ఎమెర్జింగ్ మార్కెట్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ తెలుసుకోవాల్సిందేంటంటే వాస్తవ ఆర్థిక పరిస్థితులు ఈ పెరుగుదలను ఎంతవరకు సమర్ధించగలవు?’ అని రాజన్ అన్నారు. తక్కువ వడ్డీ రేట్లు, మాన్యుఫాక్చరింగ్ గ్రోత్, చిన్న కంపెనీల దివాలాతో పెద్ద కంపెనీలు లాభపడడం తాత్కాలికంగా పాజిటివ్ సంకేతాలను క్రియేట్ చేశాయని అభిప్రాయపడ్డారు. ‘సెన్సెక్స్‌ను చూస్తే ఎకానమీలో సమస్యలన్ని తీరిపోయాయని అనిపిస్తుంది. కానీ అవి ఇప్పుడే ప్రారంభమయ్యాయి’ అని పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్లో కేవలం ఒక్క షేరు లేదా అసెట్‌పై ఆధారపడకుండా పోర్టుఫోలియోని విస్తరించుకోవాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు.
For More News..