కేంద్ర ప్ర‌భుత్వ ఏర్పాటులో మా పార్టీదే కీల‌క పాత్ర: న‌వీన్ ప‌ట్నాయ‌క్

BJD will play key role in formation of Central Government

కేంద్రంలో ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే ఏ జాతీయ పార్టీకి మెజారిటీ లభించదని ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ అన్నారు. ఈ రోజు భువ‌నేశ్వ‌ర్ లో జ‌రిగిన ఓ భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. మ‌రి కొన్ని రోజుల్లో కేంద్రంలో ఏర్పాటు కాబోయే ప్ర‌భుత్వం విష‌యంలో త‌మ పార్టీ  బీజేడీ(బిజు జనతా దళ్) కీల‌కపాత్ర పోషించ‌నుంద‌ని తెలిపారు. జాతీయ పార్టీలైన యూపీఏ , ఎన్డీఏ మ‌రేత‌ర పార్టీల‌కు కూడా స‌రిపోను మెజారిటి రాద‌ని.. ప్రాంతీయ పార్టీల‌కు ఇదొక మంచి అవ‌కాశ‌మ‌ని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 20 లోక్‌స‌భ‌ సీట్ల‌ను గెలిచిన త‌మ పార్టీ ఈ సారి 21 స్థానాల‌కు 21 సీట్ల‌ను గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో 2014లో బీజేపీ త‌మ మేనిఫెస్టోలో ఒడిషా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింద‌ని, తీరా కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బీజేపీ ఆ హామీని మ‌రచిపోయింద‌ని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో రాష్ట్రంలో యువ‌త‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఆయన అన్నారు. ఒడిషాలోని బిజెపి నాయకులకు రాష్ట్ర ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప‌లు సమస్యల గురించి తెలిసి కూడా.. అధిష్టానం దృష్టికి తీసుకెళ్ల లేద‌ని న‌వీన్ ప‌ట్నాయ‌క్  ఈ సందర్భంగా దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర బీజేపీ నాయ‌కులంతా ఒడిషా హ‌క్కుల కోసం పోరాడ‌కుండా అధిష్టానం అదుపు ఆజ్ఞ‌ల్లో ఉండ‌డం శోచ‌నీయ‌మ‌ని అన్నారు.

రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు బీజేడీ వైపే ఉన్నారని,  రాష్ట్ర ప్రయోజనాలకు పోరాడుతున్న పార్టీ త‌మ‌దేనని  సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్  అన్నారు. త‌ప్ప‌కుండా ఈ ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా అనీ ఆయ‌న ఈ సంద‌ర్భంగా అన్నారు

Latest Updates