నల్లపోచమ్మ గుడి కూలిందంటే.. సర్కార్​ కూలినట్టే

హైదరాబాద్, వెలుగు‘‘సెక్రటేరియట్​లోని నల్లపోచమ్మ గుడిని కూలగొట్టారు. ఇది తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కార్​కు దినం పెట్టడానికి సంకేతం. అంటే ఈ సర్కార్ కూడా ఇక కూలుతుందన్నట్లే. గుడి కూలడంతో కేసీఆర్ నిజ స్వరూపం బయటపడింది. ఆయన గుడి మనిషి కాదని తేలిపోయింది. బీజేపీ.. కమీషన్ల, కాంట్రాక్టర్ల పార్టీ కాదు. కేసీఆర్​ను 24 గంటలు అగ్గి మీద నిలబెట్టే పార్టీ’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు హెచ్చరించారు. బీజేపీ నిర్వహిస్తున్న ప్రాంతీయ జన సంవాద్ వర్చువల్ ర్యాలీలో భాగంగా శుక్రవారం నల్గొండ, మహబూబ్​నగర్ ఉమ్మడి జిల్లాల సభ జరిగింది. హైదరాబాద్​లోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన డిజిటల్ వేదికపై ముఖ్య అతిథిగా మురళీధర్​ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ స్టేట్​ ప్రెసిడెంట్​, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ అధ్యక్షత వహించారు. ప్రోగ్రామ్​లో రెండు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు డీకే అరుణ, జితేందర్​రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ రాంచందర్​రావు, చింతా సాంబమూర్తి, మనోహర్​రెడ్డి, ప్రేమేందర్​రెడ్డి పాల్గొన్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ వేదికల్లో  జనం, పార్టీ క్యాడర్ పాల్గొన్నారు. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నేతలు జనానికి వివరించారు.

కేసీఆర్​ను జనం ముందు నిలబెడతాం

కేసీఆర్ వ్యవహారశైలితో రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి నెలకొందని, ప్రజలు కరోనాతో భయాందోళనలకు గురవుతున్నారని మురళీధర్​రావు చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలిచి, వారిలో ధైర్యాన్ని నింపాల్సిన కేసీఆర్ మాయమవడం ముమ్మాటికీ టీఆర్​ఎస్​ సర్కార్ వైఫల్యామేనని మండిపడ్డారు. తమ సీఎం మాయమయ్యారని ప్రజలు అంటుంటే.. వారిని అరెస్టులు చేస్తున్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. కేసీఆర్​ను బీజేపీ జనం ముందు నిలబెడుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నిత్యం ప్రజల మధ్య ఉండే నేత అని, ఆయన ప్రజల కోసమే జీవిస్తారని చెప్పారు. కొందరైతే ఒక రోజు కనిపిస్తే వారం వరకు కనిపించరని టీఆర్ఎస్ చీఫ్​ను ఉద్దేశించి మురళీధర్​రావు అన్నారు. రాష్ట్రంలో కరోనాకు ప్రత్యేకమైన హాస్పటల్స్ లేవని, బెడ్స్ లేవని, కరోనా పేషెంట్లకు ప్రత్యేక రవాణా వసతి కూడా లేదని దుయ్యబట్టారు. ఆక్సిజన్ అందక ఎందరో పేషెంట్లు చనిపోతున్నారని, ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప వారు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు.

ఏ అడ్డా మీదనైనా చర్చకు రెడీ

ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులిస్తే, సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మురళీధర్ రావు ఆరోపించారు. ఢిల్లీలో మోడీకి ఒంగి సలాం చేసే కేసీఆర్, ఇక్కడ మాత్రం కేంద్రంపై తిట్ల పురాణం మొదలుపెడుతున్నారని, ఇది బీజేపీ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకే ఎక్కువ నిధులు ఇచ్చారని, ఈ అంశంపై ఏ అడ్డామీదనైనా చర్చకు రెడీ అని సవాల్​ విసిరారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్​ మోడీ ఘనతేనని, దీని కోసం కేంద్రం రూ.41 వేల కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చి, రూ.11 వేల కోట్లను రుణంగా మంజూరు చేసిందన్నారు. రామగుండం ఎఫ్​సీఐ, ఐడీపీఎల్ పునరుద్ధరణ, బీబీ నగర్ ఎయిమ్స్, ఈఎస్ఐ, జహీరాబాద్ నిమ్జ్, ఆర్మూర్​లో సెజ్ ఇవన్నీ కేంద్రం ఇచ్చినవేనని వివరించారు. 1,800 కిలోమీటర్ల నేషనల్​ హైవేలను తెలంగాణకు మంజూరు చేసిందని, ఇందుకోసం రూ.46 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. ప్రజాస్వామ్యం లేని పార్టీలతో ప్రజలకు స్వేచ్ఛ ఉండదని, బంగారు తెలంగాణగా మారాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు.

ఉద్యమాలు చేస్తే కేసులా?

ఉద్యమాలు చేస్తే కేసులుపెట్టడం కేసీఆర్​కు అలవాటుగా మారిందని సంజయ్​ ఫైర్​ అయ్యారు. రైతులు, చివరకు తనపైనా కేసు పెట్టారన్నారు. పెద్ద కులాల రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ఒవైసీ హిందూ ధర్మాన్ని కించ పరుస్తున్నారని, హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, ఒవైసీ కలిసి హిందూ కుల వృత్తుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. చేనేత కార్మికుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో జోలె పట్టిన కేసీఆర్​.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. చింతికింద మల్లేశంకు పద్మశ్రీ ఇచ్చి చేనేత కార్మికులను సత్కరించిన ఘనత ప్రధాని మోడీదేనన్నారు. ఉగ్రవాదులకు శవ యాత్రలు, సంతాప సభలు చేసే వాళ్లకు వత్తాసు పలికే పార్టీలకు మద్దతివ్వాలో.. జనం కోసం పోరాడే బీజేపీకి మద్దతివ్వాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ తెలంగాణ నిర్మాణం కోసం గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో 100లో 22 మందికి కరోనా

 

Latest Updates