మిల్లర్లతో సర్కార్ కుమ్మక్కు..దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది

హైదరాబాద్, వెలుగురైస్ మిల్లర్లతో రాష్ట్ర సర్కార్​ కుమ్మక్కై దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తోందని, దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అడుగడుగునా మోసపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతులే తమ కష్టార్జితంతో పండించిన పంటను కాలబెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో సీఎం కేసీఆర్ ఆలోచించాలని ఆయన సూచించారు. ‘‘ఓ మంత్రేమో ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటరు. సీఎం మాత్రం రైతు పండించిన చివరి గింజ వరకూ కొంటామని చెప్తరు.  దీని వల్ల రైతుల్లో అయోమయం నెలకొంది. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారింది” అని మండిపడ్డారు. తమ పార్టీ ఎక్కడ కూడా రైతు సమస్యలను రాజకీయం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్​ తమిళిసై దృష్టికి బీజేపీ నేతలు తీసుకెళ్లారు.

సంజయ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి రాజ్ భవన్​ వెళ్లి గవర్నర్​ను సోమవారం కలిశారు. రైతు సమస్యలపై మెమోరాండం అందజేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రానీయకుండా వారి సమస్యలపై సీఎం కేసీఆర్ వెంటనే దృష్టి పెట్టేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.   ఐకేపీ సెంటర్లలో ధాన్యం అమ్ముకునేందుకు వచ్చి తాలు, తరుగు పేరుతో రైతులు మోసపోతున్నారని, పంటను అమ్మేందుకు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని చెప్పారు.

సీఎంది రాక్షసానందం

గవర్నర్​ను కలిసిన అనంతరం  రాజ్​భవన్​ వద్ద బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు. రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే  ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం కేసీఆర్​ మాటల గారడీ చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను తాము రాష్ట్ర ప్రభుత్వం ముందుంచితే, తమపై కొందరు మంత్రులను, అధికార పార్టీ నేతలను ఎగదోస్తూ సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో, సీఎం కేసీఆర్ అత్తగారి ఊళ్లోనూ ఐకేపీ కేంద్రాల్లో  రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదని, ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. రైతు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా విషయంలో తమ పార్టీ కేడరంతా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని చెప్పారు. అలాంటప్పుడు రైతు సమస్యలను రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.  మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు తమపై విమర్శలు చేయడం మాని, రాష్ట్రంలోని ఐకేపీ సెంటర్లను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని బండి సంజయ్​ సూచించారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆల్​ పార్టీ మీటింగ్​ ఏర్పాటు చేయాలని, రైతు పాలసీని ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

Latest Updates