
- సికింద్రాబాద్‌లో బీజేపీ యువమో
- అడ్డుకున్న పోలీసులు.. బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాశ్‌కు గాయాలు
- పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నరు: బండి సంజయ్
సికింద్రాబాద్, వెలుగు: ‘డర్టీ హరి’ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ టివోలీ థియేటర్ వద్ద బీజేవైఎం ఆందోళనకు దిగింది. సినిమాను నిషేధించాలని, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసిన బీజేవైఎం అధ్యక్షుడు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, నినాదాలు చేశారు. ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో బీజేవైఎం అధ్యక్షుడు భాను ప్రకాశ్‌కు గాయాలయ్యాయి. గాయపడిన భానుప్రకాశ్‌ను ట్రీట్మెంట్ నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించామని, తరువాత జనరల్ వార్డుకు మార్చామని పోలీసులు తెలిపారు. ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
దాడిని ఖండించిన బండి సంజయ్
సికింద్రాబాద్‌లో శాంతియుతంగా నిరసన చేస్తున్న బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాశ్‌పై పోలీసుల దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. వరంగల్ టూర్లో ఉన్న సంజయ్ దాడి విషయం తెలియగానే ఫోన్లో భాను ప్రకాశ్‌ను పరామర్శించారు. అనంతరం హైదరాబాద్‌లో మీడియాకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘డర్టీ హరి’ సినిమాను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. భాను ప్రకాశ్‌కు ఛాతిలో నొప్పి ఉందని చెప్పినా వినకుండా బొల్లారం పోలీస్టేషన్లో నిర్భంధించారని సంజయ్ ఆరోపించారు. ట్రీట్మెంట్ కోసం అంబులెన్స్‌ను పిలవాలని వేడుకున్నా పోలీసులు వినలేదని, ఇది తెలంగాణ పోలీసుల క్రూరత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు టీఆర్ఎస్ సర్కార్ కనుసన్నల్లో పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ లోతుకుంటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న భాను ప్రకాశ్‌ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. పోలీసుల దాడిని ఖండించారు. బీజేపీ ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్న కేసీఆర్ సర్కారు తీరును ఆయన తప్పుపట్టారు. త్వరలోనే కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాజాసింగ్ అన్నారు.