గంగానది స్పూర్తిగా మూసీ కోసం ఉద్యమిద్దాం

దేశంలో గంగా నది ప్రక్షాళనకు మోడీ శ్రీకారం చుట్టారు.. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళనకు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్  అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో ‘మూసీ శుద్ధి కోసం ఉద్యమిద్దాం– తెలంగాణ గంగను పవిత్రం చేద్దాం’ అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా అనంతగిరిలోని మూసీ నది జన్మస్థలంలో లక్ష్మణ్ గంగా హారతి పూజలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మూసీ నదిని పరిశుభ్రంగా మార్చుతామని కేసీఆర్​ హామీ ఇచ్చారని లక్ష్మణ్​ గుర్తుచేశారు. మొదటి టర్మ్​లో కేసీఆర్​ పట్టించుకోలేదని, ఇప్పుడు రెండోసారి​ అధికారం చేపట్టి కూడా ఏడాది గడిచినా మూసీ ప్రక్షాళనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తెలంగాణలో జన్మించిన ఏకైక పుణ్యనది మూసీ అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. మూసీ నది కలుషితం కావడంతో ఆ నీటితో పండించే పంటలు కూడా విషతుల్యం అవుతున్నాయని పేర్కొన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాలు కబ్జా కోరల్లో ఉన్నాయని, ఆ భూముల చెర విడిపించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు మూసీ నదిని కలుషితం చేస్తున్నాయని, ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ ప్రక్షాళనపై వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నల్లగొండ జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకే మూసీ శుద్ధి ఉద్యమం చేపట్టామని ఆయన తెలిపారు. ఇప్పుడు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విడతల వారీగా ఏడాది పాటు కొనసాగిస్తామని లక్ష్మణ్​ చెప్పారు. ప్రభుత్వం మూసీ నదిని శుద్ధిచేసే దాకా బీజేపీ ఉద్యమం కొనసాగిస్తుందన్నారు. అంతకుముందు అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి, రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని లక్ష్మణ్ ప్రత్యేక పూజలు చేశారు.

మూసీ ప్రక్షాళన చేతల్లో చూపండి..

మూసీ నది ప్రక్షాళనపై మాటలతో కాకుండా చేతలతో చూపించాలని ప్రభుత్వాన్ని లక్ష్మణ్ ​డిమాండ్​ చేశారు. మెయినాబాద్​ మండలం హిమాయత్​ చౌరస్తా నుంచి ఆయన మెగా ర్యాలీ ప్రారంభించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో అనంతగిరిలోని భవనాశిని పుష్కరిణి దాకా ర్యాలీగా సాగారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని లక్ష్మణ్​ ఈ సందర్భంగా విమర్శించారు. వెంటనే ఆ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్​ చేశారు.

Latest Updates