బతుకమ్మపై బీజేపీ ఫోకస్

  •                 రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయం
  •                 నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
  •                 మహిళా కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని నిర్ణయం

రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. బతుకమ్మ పండుగపై దృష్టి పెట్టింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఆటపాటలను పార్టీ తరఫున ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. బతుకమ్మ పండుగకు ముందే ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో నిజాం పాలనలో తెలంగాణ మహిళలకు జరిగిన అవమానాలను, నిజాం పాలకుల అరాచకాలను ఊరూరా ప్రచారం చేయాలని నిర్ణయించింది. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  ఇటీవలే మహిళా మోర్చా నేతలు, ఇతర మహిళా నాయకులతో సమావేశమై చర్చించారు. బతుకమ్మ ద్వారా పార్టీని జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు.

కేంద్ర మంత్రులనూ రప్పించి..

కొంతకాలం కిందటి వరకు తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్​ కుమార్తె, మాజీ ఎంపీ బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ జాగృతి సంస్థ పేరిట నిర్వహించినా టీఆర్ఎస్​కు సంబంధించిన కార్యక్రమంగానే కొనసాగింది. ఇప్పుడు అంతకు మించి వాడవాడలా బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనం నిర్వహించాలని ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. బతుకమ్మ ఉత్సవాలు అంటే బీజేపీ అనేలా ముద్ర వేయాలన్నట్టుగా నిర్వహించాలని భావిస్తున్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి వంటి వారిని జిల్లాలకు ఆహ్వానించి.. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ విమోచన దినోత్సవాలను వారం పాటు నిర్వహించాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది. ఆ కార్యక్రమం పూర్తి కాగానే.. పది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించేలా ప్లాన్​ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల నాటికి పార్టీకి ఊపు తీసుకువచ్చేందుకు ఈ కార్యాచరణ ఉపయోగపడుతుందని భావిస్తోంది.

Latest Updates